Home ఆంధ్ర ప్రదేశ్ ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీ

ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీ

281
0
Anandayya Medicine Distribution
Anandayya Medicine Distribution

ఎన్నో అవాంతరాలు, కోర్టు తీర్పులు, రాజకీయ ఒత్తిళ్ళను దాటుకుని.. ఆనందయ్య మందు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా గొలగమూడిలో సోమవారం ఆనందయ్య ఆయుర్వేద మందును స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. తొలుత ప్రకటించిన విధంగా కాకుండా రోజుకు కేవలం రెండు వేల నుంచి మూడు వేల మందికి మాత్రమే మందును పంపిణీ చేయనున్నారు. నోటి ద్వారా అందించే మందులకు మాత్రమే హైకోర్టు అనుమతినివ్వడంతో ఆ దిశగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. కంట్లో వేసే చుక్కల మందుపై కోర్టు నేడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ ఆనందయ్య మందుతో దుష్పరిణామాలు లేవని నిపుణులు తేల్చారన్నారు.

Anandayya Medicine Distribution
Anandayya Medicine Distribution

సాంప్రదాయ ఆయుర్వేదానికి ఎంత శక్తి ఉందో ఆనందయ్య ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆనందయ్య మందు కరోనా రోగులకు దివ్యౌషధమని, అయితే ఇంగ్లీషు మందులు కూడా వినియోగించాలని ఆయన సూచించారు. కరోనాతో బాధపడుతున్న వారు ఎరుపు రంగు ప్యాకెట్టును, కరోనా రాకుండా ఉండేందుకు నీలం రంగు ప్యాకెట్టును వాడాలని వివరించారు.చెప్పిన సమయానికి మందును అందించిన ఆనందయ్యను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రమంతటా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. 144 సెక్షన్ ఉండడంతో కృష్ణపట్నంలో ఇతర ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు.

Anandayya Medicine Distribution
Anandayya Medicine Distribution

స్థానికులను కూడా ఆధార్ కార్డును చూపించిన తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.  ఇక తిరుపతిలో ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఆయుర్వేద మందు తయారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది .స్థానికేతరులు ఎవరూ ఆయుర్వేద మందు కోసం రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారంతో త్వరలోనే రాష్ట్రమంతటా మందు పంపిణీ చేపడతామని వివరించారు. మందు పంపిణీ విషయంలో ఆనందయ్యకు, ఆయన శిష్యులకు అభిప్రాయ బేధాలు ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే మందు పంపిణీ యధావిధిగా చేపట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆనందయ్య మందు కరోనాను తగ్గిస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, దుష్పరిణామాలు లేవని సీసీఎంబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆక్సిజన్ సాచ్యురేషన్ పెంచే కంట్లో వేసే చుక్కల మందుకు హైకోర్టు అనుమతి ఇస్తుందని ఆనందయ్య నిరీక్షిస్తున్నారు. 

Read Also: AP News | Telangana News | Politics | International | National News | Sports | Covid 19 

Previous articleపెరుగు తినేవారికి అలర్ట్..వీటితో కలిపి తింటే ఆ ప్రమాదం
Next articleమీకు గొంతునొప్పా? మీ సమస్యలకు అద్భుతమైన దివ్యౌషధం ఇదే