Home తెలంగాణ 20 నెలల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతాం : రేవంత్ రెడ్డి

20 నెలల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతాం : రేవంత్ రెడ్డి

455
0
Congress Party Dalitha Girijana Dandora At Indravelli
Congress Party Dalitha Girijana Dandora At Indravelli

20 నెలల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతాం : రేవంత్ రెడ్డి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరో 20 నెలల్లో జైలుకు పంపడం తథ్యమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభలో ఆయన మాట్లాడారు. ఇంద్రవెల్లి గడ్డ అంటేనే చరిత్ర, పౌరుషం, త్యాగం ఉంది, గుండె ధైర్యానికి ప్రతీక అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు ఇంద్రవెల్లి నుంచే కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించిందని చెప్పారు. దళితుడిని రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన దరిద్రుడు ఆయనే కుర్చీ ఎక్కి కుర్చున్నాడని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తెలంగాణాలో అధిక సంఖ్యలో మాదిగ సోదరులు ఉన్నారని, వారికి కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు స్థానం ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యపై అవినీతి ఆరోపణ చేసి మంత్రిమండలి నుంచి బయటకు పంపిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు వాటిని నిరూపించలేక పోయిందన్నారు. ఓట్ల కోసం మాత్రమే హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేస్తానని సీఎం నిస్సిగ్గుగా చెప్పారన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు దళితులు, ఆదివాసీలు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. అధికారం అనుభవించి కుటుంబ సభ్యులకు ఆస్తులు కట్టబెట్టిన కేసీఆర్.. ఆదివాసీలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటే అడ్డుకుంటున్నారన్నారు.

ఇంద్రవెల్లి సభకు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారని, వీరిని అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పరిచారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అందరికి అంతకుఅంత చెల్లిస్తామని చెప్పారు. కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను మరిచిపోమని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు. దళితులకు, గిరిజనులకు పొలం ఇచ్చిన, ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. తెలంగాణాలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల కోసం సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీయేనని, ఆమె రుణం తీర్చుకోవాల్సిన అవసరం మనకుందన్నారు. ఆగస్టు 18న ఇబ్రహీం పట్నం వద్ద ఇదే దళిత, గిరిజన దండోరా చేపట్టామని, ఇదే స్థాయిలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సభకు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసన సభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous articleపంజాబ్ లో టిఫిన్ బాక్స్ బాంబు.. ఉలిక్కిపడిన నిఘా వర్గాలు
Next articleసరికొత్తగా గూగుల్ డ్యుయో