Home Covid 19 సెప్టెంబర్ నుంచి సీరంలో స్పుత్నిక్ ఉత్పత్తి

సెప్టెంబర్ నుంచి సీరంలో స్పుత్నిక్ ఉత్పత్తి

168
0
Sputnik manufacturing from September in the serum company
Sputnik manufacturing from September in the serum company

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను సెప్టెంబర్ నుంచి పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూనిట్లలో ఉత్పత్తి చేయనున్నారు. భారతదేశంలో సంవత్సరానికి 300 మిలియన్లకు పైగా మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీదారైన ఆర్డిఐఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) తెలిపింది. టెక్నాలజీ బదిలీ ఇప్పటికే ప్రారంభమైందని, మొదటి బ్యాచ్ టీకాలు సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీ బదిలీ ప్రక్రియలో భాగంగా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే గమలేయ సెంటర్ నుంచి సెల్, వెక్టర్ నమూనాలను అందుకుంది. వాటి దిగుమతిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించడంతో, ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది ఆర్డిఐఎఫ్ తెలిపింది.

దీనిపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అథర్ పూనావాలా మాట్లాడుతూ స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఆర్‌డిఐఎఫ్‌తో భాగస్వామ్యం కావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. సెప్టెంబర్లో ట్రయల్ బ్యాచ్‌లతో పాటు, సమీప భవిష్యత్ లో మిలియన్ల మోతాదులను తయారు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, భారత దేశంతో పాటు, ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించాలంటే కొంచెం క్లిష్టతరమైన పనిగా ఆయన అభివర్ణించారు. మహమ్మారిని కట్టడి చేసే ప్రక్రియలో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సహకరించడం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సిఇఒ కిరిల్ దిమిత్రివ్ మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ప్రాణాలను కాపాడేందుకు తమ ఉత్పత్తి సామర్ధ్యాలను గణనీయంగా పెంచుతున్నామన్నారు. దీనికి తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ప్రధాన దశ అని అన్నారు.
దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి టీకాలు వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. టీకా ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ ప్రయత్నిస్తున్న క్రమంలో సీరం, ఆర్డిఎఫ్ఐ నుంచి సంయుక్త ప్రకటన రావడం శుభపరిణామమేనని పలువురు ఆరోగ్య రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Previous articleఅంతర్రాష్ట్ర ప్రాజెక్టులను జాతీయం చేసేయండి : సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు
Next articleకావేరి నదిపై కర్నాటక ప్రాజెక్టు.. తమిళనాడు ఫైర్