Home జాతీయ వార్తలు సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతుల నిరసన

సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతుల నిరసన

262
0
Farmers Protest at Jantar Mantar
Farmers Protest at Jantar Mantar

ఓ పక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా, భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ టికాయత్ నేతృత్వంలోని రైతులు ఢిల్లీ దిశగా సాగుతున్నారు. పార్లమెంట్ కు కూత వేటు దూరంలో జంతర్ మంతర్ వేదికగా రైతులు తమ నిరసనను తెలియజేయనున్నారు. వీరి నిరసనకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ చేపట్టాలని కేజ్రీవాల్ బుధవారం అనుమతినిచ్చారు.
ఈ సందర్భంగా రైతు నాయకులు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ రైతుల నిరసన పార్లిమెంట్ కు 150 మీటర్ల దూరంలోనే కొనసాగుతుందని, తాము (రైతులు) కూడా కిసాన్ పార్లిమెంట్ ను నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 26 న ఎర్రకోట వద్ద ఏర్పడిన హింస వంటి అంశాలను మీడియా ప్రస్తావించగా పోకిరి చేష్టలు రైతులెవరూ చేయరని స్పష్టం చేశారు. తాము దురాక్రమణదారులం కాదని, శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.

తొలుత టికాయత్ ఢిల్లీ సరిహద్దులోని సింఘూ సరిహద్దుకు చేరుకొని, అక్కడ నిరసన చేపడుతున్న రైతులతో సమావేశం కానున్నారు. తరువాత జంతర్ మంతర్ వద్ద ‘కిసాన్ సంసాద్’ నిర్వహించడానికి ఢిల్లీ దిశగా బయల్దేరనున్నారు. ఇదిలావుండగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల మధ్య జంతర్ మంతర్‌ వద్ద రైతుల నిరసనల దృష్ట్యా సింగు సరిహద్దు, తిక్రీ బోర్డర్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నుంచి 200 ల మంది, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కెఎంఎస్‌సి) కు ఆరుగురు వ్యక్తులతో రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి రైతులకు అనుమతి ఉంది. ఇక రైతు చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ఇప్పటివరకు కేంద్రం, రైతు నాయకుల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే తాము రైతు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనలను అంగీకరించేది లేదని రైతులు స్పష్టం చేశారు.

Previous articleకరోనా భయంతో ఏడాదిన్నరగా తలుపులేసుకుని.. ఏపీలో వెలుగు చూసిన ఘటన
Next articleనర్మగర్భంగా యెడియూరప్ప వ్యాఖ్యలు.. మార్పు తథ్యమేనా?