Home ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ వివేకా మర్డర్ కేసు.. దూకుడు పెంచిన సిబిఐ

వైఎస్ వివేకా మర్డర్ కేసు.. దూకుడు పెంచిన సిబిఐ

532
0
YS Viveka murder case: CBI sleuths raid on the houses of suspects, seizes weapons
YS Viveka murder case: CBI sleuths raid on the houses of suspects, seizes weapons

వైఎస్ వివేకా మర్డర్ కేసు.. దూకుడు పెంచిన సిబిఐఎట్టకేలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కు ముడి వీడేలా కనిపిస్తోంది. ఈ మేరకు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. కేసులో అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వారి ఇళ్లను జల్లెడ పట్టి పలు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ అధికారులు తమ కార్యాలయంగా చేసుకున్న కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో విచారణను కొనసాగిస్తున్నారు. కేసులో అనుమానితులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ముగ్గురు ఎస్‌బిఐ అధికారులను విచారించారు.

హత్యను కప్పి పుచ్చడానికి వివేకానందరెడ్డి ఇంట్లో అప్పట్లో రక్తపు మరకలను తుడిచి వేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పులివెందులలోనే నివాసముంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. రోజువారీ కూరగాయలు కోయడానికి, ఇతర పనులకు ఉపయోగించే కత్తులను ఆధీనంలోకి తీసుకున్నారు. దొరికిన వాటి ఆధారంగా నిందితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అనంతరం మరో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ నివాసానికి కూడా సీబీఐ అధికారులు వెళ్లారు. సునీల్ కుమార్ కు సంబంధించిన బ్యాంకు ఖాతా పుస్తకం, చెక్ బుక్కు, హత్యా సమయంలో వేసుకున్నదిగా భావించిన ఓ పాత చొక్కాను తీసుకున్నారు. దీంతో పాటు వారి బంధువుల ఇళ్లను కూడా సోదాలు చేపట్టారు. అనంతరం వైసిపి రాష్ట్ర నాయకులు ఉమా శంకర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి తదితరులను కూడా కేసుకు సంబంధించి ప్రశ్నించారు.

ఆర్ధిక లావాదేవీల కారణంగానే వివేకా హత్య జరిగిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. ఈ మేరకు కర్ణాటకకు ఈ కేసులో లింకులను గుర్తించారు. అక్కడి రెవెన్యూ అధికారులు, బ్యాంకు అధికారులను విచారణ కార్యాలయానికి రప్పించారు. వీరంతా 20 వాహనాలలో రావడం చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ కస్టడీలో నిందితులు కీలక సమాచారాన్ని బయట పెట్టేశారని తెలుస్తోంది. దాని ఆధారంగానే సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో హత్యకు గురైన వివేకా కుమార్తె, సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా సిబిఐ అధికారులను కలుసుకున్నారు. కేసు దర్యాప్తు గురించి ఆరా తీసి, తమకు తెలిసిన సమాచారాన్ని వారికీ అందించారు.

Previous articleకాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాల క్లోజ్.. ఏం జరగనుందంటే?
Next articleశ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాలు (2021-22)