Home ఆంధ్ర ప్రదేశ్ విశాఖ ఉక్కు : ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

విశాఖ ఉక్కు : ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు

464
0
Vizag Steel Plant Employees Protest at AP Bhavan New Delhi
Vizag Steel Plant Employees Protest at AP Bhavan New Delhi

విశాఖ ఉక్కు : ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు దేశ రాజధాని ఢిల్లీలో విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు మంగళవారం నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రానికి తమ ఆవేదనను తెలిపేలా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి, వామపక్ష పార్టీలు కార్మికులకు మద్దతుగా నిలిచాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీ విశాఖ ఉక్కు-ఆంధ్ర హక్కు నినాదాలతో హోరెత్తిన విషయం తెలిసిందే. సోమవారం, ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద బారికేడ్లు పోలీసు ఆంక్షలను ఛేదించి నిరసన తెలిపారు.
రెండు రోజుల నిరసనల్లో భాగంగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు రెండో రోజు ఏపీ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరై సంఘీభావం తెలిపారు. మరోవైపు, టిడిపి ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇచ్చారు. ఏపీ భవన్‌కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఉక్కును ప్రైవేటీకరించే నిర్ణయం చాలా విచారకరమని, ఈ నిర్ణయం వల్ల దాదాపు 32,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ప్రాణ త్యాగాలు, మరెంతో మంది భూములను త్యాగం చేయడం వల్ల ఏర్పడిన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం సరి కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టిడిపి పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. తాము పార్లమెంటులో దీనిపై పోరాటం కొనసాగిస్తామని, ఈ విషయంలో టిడిపి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తుందని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము వెనక్కి తగ్గబోమని కేంద్రం సోమవారం తెలిపింది. దాని కోసం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

For latest News

Previous articleసిబిఎస్ఇ ‘పది’ ఫలితాలు విడుదల
Next articleఆగస్టు 15న మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు