Home జాతీయ వార్తలు రాహుల్-ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ భేటీ

రాహుల్-ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ భేటీ

129
0
Prashant Kishor Enter in Punjab Political Conflict
Prashant Kishor Enter in Punjab Political Conflict

తాను బాధ్యతలు తీసుకున్న రాజకీయ పార్టీని అప్రతిహతంగా విజయతీరాలకు చేర్చడంలో సిద్ధహస్తుడైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మంగళవారం కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని వారి నివాసానికి పీకే వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీష్ రావత్ సహా పార్టీ సీనియర్ నాయకులు హాజరైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సమావేశంలో ప్రస్తుతం పంజాబ్‌ కాంగ్రెస్ విభాగంలో గొడవలు, గందరగోళాల నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వివాదాలు చిలికి చిలికి గాలివానలా తయారై, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభంలా మారింది. పంజాబ్ లో వచ్చే సంవత్సరం ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై తాత్సారం కావడం ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ల మధ్య అభిప్రాయం బేధాలు తీవ్రతరం కావడంతో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనగా మారింది. గత వారం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఢిల్లీ వచ్చి ప్రియాంక గాంధీని కలిశారు. తరువాత ఆమెతో పాటు వెళ్లి రాహుల్ గాంధీతోను భేటీ అయ్యారు. దీంతో ఆయనకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షా బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. ఇదే తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఢిల్లీ లోని తన నివాసం కపుర్తలా హౌస్ లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. ఈయన గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. దీంతో రాహుల్-ప్రియాంక లతో పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. ఇక్కడ పార్టీలో అంతః కలహాలు, కుమ్ములాటలు పార్టీ పరిస్థితిని దిగజార్చుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు ఆవేదనతో ఉన్నాయి. అవి అలాగే కొనసాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నాయకులు ఆందోళనతో ఉన్నారు.

Previous article2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ భారత్ లో..
Next articleపశ్చిమ బెంగాల్ లో పీఏసీ చిచ్చు.. గవర్నర్ తో సువేందు భేటీ