Home అంతర్జాతీయ వార్తలు రామప్ప దేవాలయం.. ఇక ప్రపంచ వారసత్వ ప్రదేశం

రామప్ప దేవాలయం.. ఇక ప్రపంచ వారసత్వ ప్రదేశం

585
0
UNESCO Recognized Ramappa Temple as Heritage Construction
UNESCO Recognized Ramappa Temple as Heritage Construction

రామప్ప దేవాలయానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. ఇక ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునెస్కో ఆదివారం ప్రకటించింది. దీనిపై కమిటీ వర్చువల్ మీట్ నిర్వహించి, ఏకాభిప్రాయం కుదరడంతో సంబంధిత ప్రకటన చేసింది. సభ్య దేశాలలో నార్వే ఈ ప్రకటనని వ్యతిరేకించగా, రష్యాతో సహా 17 దేశాలు మద్దతు తెలిపాయి. ప్రపంచ వారసత్వ కమిటీలో ప్రస్తుతం రష్యా, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్, బోస్నియా, హెర్జెగోవినా, ఇథియోపియా, గ్వాటెమాల, హంగేరీ, కిర్గిజిస్తాన్, మాలి, నైజీరియా, నార్వే, ఒమన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, థాయిలాండ్, ఉగాండా దేశాలు ఉన్నాయి. దీనిపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన చేశారు. ఆయన ఒక ట్వీట్‌లో, యునెస్కో తెలంగాణలోని వరంగల్‌లోని పాలంపేటలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం తనకు ఎంతో ఆనందం ఉంది అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వెలిబుచ్చారు. “అద్భుతం.. తెలంగాణ ప్రజలకు అభినందనలు. దిగ్గజ రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని తెలియజేస్తోంది. ఈ సమున్నత ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనాన్ని అంతా తెలుసుకోవాలని అందరినీ కోరుతున్నాను ”అని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. యూనెస్కోకు, దాని సభ్య దేశాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రామప్ప దేవాలయం చరిత్ర ఇదీ..
రామప్ప దేవాలయం అని కూడా పిలువబడే రామలింగేశ్వర ఆలయానికి దాని ప్రధాన శిల్పి రామప్ప పేరు పెట్టారు. శిల్పి పేరు మీద ఉన్న అతి కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి. దీనిని క్రీ.శ 1213వ సంవత్సరంలో అప్పటి కాకతీయ పాలకుడు గణపతి దేవుని హయాంలో సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించారు. ఈ ఆలయం తెలంగాణలోని ములుగు (పాత వరంగల్) జిల్లాలోని వెంకటపూర్ మండలంలోని పాలంపేట్ గ్రామంలో ఉంది. ఆలయ గోడలు, స్తంభాలు, పైకప్పులపై శిల్పకళ అచ్చెరువొందేలా ఉంటుంది. ఈ ఆలయం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది ఇటుకలను ఉపయోగించి నిర్మించబడింది. అవి నీటిలో తేలియాడే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆలయం పూర్తి కావడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కృష్ణ శిల(బ్లాక్ డోలరైట్)తో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో నిర్మించిన కట్టడం దేశంలో మరెక్కడా లేదు.

“రుద్రేశ్వర (రామప్ప) ఆలయం” యునెస్కో తాత్కాలిక జాబితాలో ఏప్రిల్ 15, 2014 నుండి ఉంది. ఈ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రుద్రేశ్వర (రామప్ప) ఆలయం కాకతీయ కాలంనాటి వాస్తు శిల్పం. రుద్రేశ్వర (రామప్ప) ఆలయం నకు సంబంధించిన ప్రతిపాదన పత్రాన్ని 2018 లో ప్రపంచ వారసత్వ కేంద్రానికి సమర్పించారు. ఇది 2019 సంవత్సరంలో కమిటీ ముందుకు వచ్చింది. అంతర్జాతీయ స్మారక, స్థలాల మండలి(ICOMOS)కి చెందిన నిపుణుడు 2019 సెప్టెంబర్‌లో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. 9 లోపాలను ఎత్తి చూపి, అవి సరి చేస్తేనే ప్రపంచ వారసత్వ గుర్తింపు వస్తుందని చెప్పారు. దీంతో డబ్ల్యుహెచ్‌సి కోరినట్లుగా 2019 అక్టోబర్ లో ఒకసారి, 2020 ఫిబ్రవరిలో రెండోసారి వారు కోరిన విధంగా ప్రతిపాదన పత్రాలను సమర్పించారు. 2020 మేలో చైనాలోని ఫుజౌ వేదికగా జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అయితే కోవిడ్ వ్యాప్తి చెందడంతో కమిటీ సమావేశం రద్దు చేయబడింది. చివరకు ఆదివారం జరిగిన సమావేశంలో రష్యా మనకు మద్దతుగా నిలబడింది. మిగిలిన దేశాలు కూడా రష్యా బాటలో నడిచాయి. అలా మన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.
ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం..
రామప్ప ఆలయం చుట్టుపక్కల ఉన్న రామప్ప చెరువు, కొండలు, అటవీ భూముల పవిత్రతను కాపాడటానికి తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ “పాలంపేట ప్రత్యేక అభివృద్ధి అథారిటీ (పిఎస్‌డిఎ)”ను ఏర్పాటు చేసింది. కేంద్ర పురాతత్వ శాఖ కూడా అంతర్జాతీయ మద్దతు కోసం విశేష కృషి చేసింది. రామప్ప దేవాలయ విశిష్టతను వివరించే డోసియర్ (ప్రతిపాదన పుస్తకం) కోసమే రూ.25 లక్షల వరకు వెచ్చించింది.

Previous articleవ్యాక్సిన్ల ఉత్పత్తిపై కేంద్రం వేర్వేరు లెక్కలు
Next articleయెడియూరప్ప అస్త్ర సన్యాసం.. నేడే రాజీనామా