Home క్రీడలు రజతం సాధించిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా

రజతం సాధించిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా

527
0
Ravi Dahiya Takes Home Olympic Silver
Ravi Dahiya Takes Home Olympic Silver

రజతం సాధించిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా: భారత రెజ్లర్ రవి కుమార్ దహియా 57 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఈ మేరకు టోక్యో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన ఈ రెజ్లర్ చివరి అంకంలో రెండుసార్లు డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ జవూర్ ఉగ్యూవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే ప్రత్యర్థికి విజయం అంత సులువుగా మాత్రం దక్కలేదు. అంతలా చివరి వరకు పోరాడిన రవికుమార్ తన ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు.
ఏదేమైనా ఒలింపిక్ రజతం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇది రెండో రజతం కాగా, మరో మూడు కాంస్యాలు సాధించిన భారత్ ఇప్పటి వరకు తన ఖాతాలో ఐదు పతకాలు వేసుకుంది.
పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల ఫైనల్లో భారత రెజ్లర్ రవి దహియా 4 – 7 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో తన ఖాతాలో రజత పతకాన్ని వేసుకున్నాడు. గోల్డ్ మెడల్ కోసం పోరాడిన రవి దహియా మొదటి బౌట్ లో 2-4తో వెనుకబడ్డాడు. ఈ క్రమంలోనే రవి బలహీనతలను సొమ్ము చేసుకున్న ఉగ్యూవ్ తన ఆధిక్యాన్ని 7-2కి పెంచాడు. కానీ భారత రెజ్లర్ లొంగలేదు. రెండు పాయింట్లు గెలుచుకుని ప్రత్యర్థికి తన సత్తా తెలియజేశాడు. అయితే పాయింట్ల అంతరం 3ను తగ్గించలేకపోయాడు. దహియా తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించాలని చూసినా, అతని రష్యన్ ప్రత్యర్థి డిఫెన్స్ స్ట్రాటజీ బలంగా ఉండటంతో అంతగా సఫలం కాలేక పోయాడు. టోక్యో ఒలింపిక్స్ లో రవి దహియా సాధించిన రజతంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో భారత్ ఇప్పటి వరకు ఆరు పతకాలు సాధించినట్లయింది. రెండో స్థానంలో నిలిచిన రవి దహియా, సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రజతం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా నిలిచాడు. 2012 లో లండన్ గేమ్స్‌లో సుశీల్ రజతం సాధించాడు.
రజతం సాధించిన రవికుమార్ ను ప్రధాని మోడీ కొనియాడారు. “రవి కుమార్ దహియా ఒక గొప్ప రెజ్లర్! అతని పోరాట స్ఫూర్తి, దృఢత్వం అత్యద్భుతం” అని పిఎం మోడీ ట్వీట్ చేశారు.

Previous articleఆగస్టు 5 చరిత్రలో గుర్తుండిపోతుంది : ప్రధాని నరేంద్ర మోడీ
Next articleపెగాసస్.. సుప్రీంను ఆశ్రయించిన యశ్వంత్ సిన్హా