Home ఆంధ్ర ప్రదేశ్ రగులుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం

రగులుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం

137
0
Vizag Steel Plant Agitation
Vizag Steel Plant Agitation

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం నానాటికీ తీవ్ర రూపు దాల్చుతోంది. సంస్థ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 147 రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి ఉద్యమానికి బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాల మద్దతు లభిస్తోంది. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపడుతున్న దీక్షాశిబిరాన్ని శుక్రవారం సందర్శించారు.

ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందన్నారు. సంస్థ కోసం వేల ఎకరాలను స్థానికులు ఇచ్చారని, వారికీ నేటికీ న్యాయం జరగలేదని అన్నారు.
విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేస్తుంటే రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను విద్యార్థి దశలోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నాని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారని, ఈ విషయంలో ఆయన చొరవ తీసుకుని ప్రయివేటీకరణను ఆపాలన్నారు. పనిలో పనిగా స్థానిక బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ హరిబాబుపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ వైపు స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ జరుగుతుంటే హరిబాబుకు పట్టదా అని ప్రశ్నించారు. ఆయనకు విశాఖ ప్రాంతంపై ప్రేమ ఉంటే తనకు లభించిన గవర్నర్ పదవిని తిరస్కరించాలని సూచించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగ్స్ పోరాడాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో నేరుగా పాల్గొంటేనే, ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 12న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నామని, అనంతరం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు.

Previous articleపేదరికం నుంచి విముక్తే లక్ష్యం : వైఎస్ షర్మిల
Next articleకారు ఎక్కనున్న ఎల్ రమణ