Home అంతర్జాతీయ వార్తలు రక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని వదిలేశా : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు

రక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని వదిలేశా : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు

247
0
Afghan president says he left country to avoid bloodshed
Afghan president says he left country to avoid bloodshed

రక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని వదిలేశా : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు తాలిబాన్లు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడంతో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లిపోయానని ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆదివారం చెప్పారు. తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్‌లో ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. తాను క్లిష్టమైన నిర్ణయాన్ని ఎదుర్కొన్నానని, లక్షలాది మంది కాబూల్ నివాసితుల భవితవ్యం 20 ఏళ్ల యుద్ధం తర్వాత ప్రమాదంలో పడిందని చెప్పారు. ఇందులో ఇప్పటికే లెక్కలేనంత మంది మరణించారని చెప్పారు.

రక్తపాతాన్ని నివారించడానికి, దేశం నుంచి బయలుదేరడం మంచిదని అనుకున్నట్లు ఘనీ పేర్కొన్నారు. అధ్యక్ష భవనం నుండి నిష్క్రమించి దేశం నుండి బయటకు వెళ్లిన తర్వాత తన మొదటి అభిప్రాయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తాలిబాన్ తిరుగుబాటుదారులు ఇప్పుడు చారిత్రాత్మక పరీక్షను ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కత్తి, తుపాకీ తీర్పులో తాలిబాన్ విజయం సాధించిందన్నారు. తమ స్వదేశీయుల గౌరవం, శ్రేయస్సు, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన చెప్పారు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో చెప్పలేదు.

ప్రెసిడెంట్ యొక్క వ్యక్తిగత అంగరక్షకుడిని ఉటంకిస్తూ న్యూస్ ఛానల్ అల్ జజీరా కొన్ని వివరాలను వెల్లడించింది. ఘనీ, ఆయన భార్య, ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాతీయ భద్రతా సలహాదారు పొరుగున ఉన్న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు వెళ్లారని పేర్కొంది.

కిక్కిరిసిన కాబూల్ విమానాశ్రయం

తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇతర దేశాలకు పారిపోయేందుకు పెద్ద ఎత్తున ఆ దేశ ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే తమ దేశానికి చెందిన పౌరులను, అధికారులను, సైనికులను తరలించేందుకు అమెరికా కొన్ని చినూక్ విమానాలను కాబూల్ విమానాశ్రయానికి పంపింది. ఆఫ్ఘన్ పౌరుల తాకిడికి తట్టుకోలేక అమెరికా సైనికులు వారిని నిరోధించేందుకు గాలిలో కాల్పులు జరిపారు. సైనిక విమానాలు ఎక్కడానికి ఆఫ్ఘన్‌లు టార్మాక్‌పైకి రాకుండా నిరోధించడానికి తాము గాలిలో కాల్పులు జరిపినట్లు యుఎస్ బలగాలు రాయిటర్స్‌కు తెలిపాయి.

ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఖతార్, యుకెతో సహా 60 కి పైగా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరాలనుకునే ఆఫ్ఘన్‌లు, అంతర్జాతీయ పౌరులు తప్పనిసరిగా బయలుదేరడానికి అనుమతించాలని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ పౌరులు, మిత్ర దేశాల పౌరులు స్వస్థలాలకు బయలుదేరేందుకు కాబూల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులను మోహరిస్తామని అమెరికా తెలిపింది.

Previous articleదాక్కో దాక్కో మేక.. రికార్డులు సృష్టిస్తున్న పుష్ప సాంగ్
Next articleగోవాలో వర్షంతో ఎంఎస్ రాజు చిత్రం షెడ్యూల్ ముగింపు