Home Covid 19 బెంగళూరులో మరింత మంది చిన్నారులకు కరోనా

    బెంగళూరులో మరింత మంది చిన్నారులకు కరోనా

    449
    0
    More children in Bengaluru test Covid positive
    More children in Bengaluru test Covid positive

    బెంగళూరులో మరింత మంది చిన్నారులకు కరోనా థర్డ్ వేవ్ మొదలవుతున్నదనే వార్తల మధ్య బెంగళూరులో కోవిడ్ – 19 బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెలలోనే దాదాపు 500 మంది పిల్లలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం తల్లిదండ్రులలో గుబులు రేపుతోంది. ఈ నెలాఖరులో 9-12 తరగతుల విద్యార్థుల కోసం కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్న తరుణంలో ఇది చోటుచేసుకోవడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

    బెంగళూరు కార్పొరేషన్ కోవిడ్ -19 వార్ రూమ్ నుండి వచ్చిన డేటా ప్రకారం 0-9 ఏళ్ల వయస్సులో దాదాపు 88 మంది, 10-19 ఏళ్ల వయస్సులో 305 మంది పిల్లలు కోవిడ్ -19 బారిన పడ్డారు. గత ఐదు రోజుల్లో 263 కేసులు నమోదయ్యాయి. వీరిలో 88 మంది 9 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారు కాగా, 175 మంది 10 – 19 ఏళ్ల మధ్య వయసు వారని తెలుస్తోంది.

    బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగ ప్రత్యేక కమిషనర్ రణదీప్ మాట్లాడుతూ గణాంకాలను చూస్తే, కేసులు పెరుగుతున్నట్లు అనిపించవచ్చు అని, కానీ కేసులు ఆందోళనకరమైన స్థాయికి వెళ్లలేదని చెప్పారు. తాము జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారం నుండి గణాంకాలు చూసినట్లు తెలిపారు. మొత్తం కేసులలో 0-19 ఏళ్ల వయసు వారికి సోకినా కేసులు 14 శాతమేనని చెప్పారు.

    తీవ్రమైన లక్షణాలతో ఉన్న పిల్లలు ఆసుపత్రిలో చేరినప్పుడు వారి వివరాలను తాము సేకరించినట్లు బెంగళూరు కార్పొరేషన్ తెలిపింది. చాలా మంది స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే చికిత్స పొందొచ్చని పేర్కొంది. గత 10 రోజుల్లో పిల్లల మరణాలు ఒక్కటి కూడా లేదని వెల్లడించింది.

    క్లస్టర్‌లలో ఎక్కువ పరీక్షించినప్పుడు, పాజిటివ్‌గా ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కోవిడ్ -19 వ్యాప్తి చేశారని కార్పొరేషన్ వైద్య అధికారులు భావిస్తున్నారు. బయటకు వెళ్లి, తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు కరోనా సోకిందని భావిస్తున్నట్లు కార్పొరేషన్ పేర్కొంది. క్లస్టర్‌లలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నప్పుడు, ఎక్కువ మంది పిల్లలు వ్యాధి బారిన పడ్డారని గుర్తించినట్లు వివరించింది. వారిలో ఎక్కువ మందికి లక్షణాలు లేవని అధికారులు ప్రకటించారు.

    Previous article300లకు పైగా ఖాతాలపై ఫేస్ బుక్ నిషేధం
    Next articleట్విట్టర్ ఇండియా ఎండీ యుఎస్ కి బదిలీ