Home Covid 19 బూస్టర్ డోస్.. డబ్ల్యుహెచ్ఓ విజ్ఞప్తిని పక్కన పెట్టిన ఫ్రాన్స్, జర్మనీ

    బూస్టర్ డోస్.. డబ్ల్యుహెచ్ఓ విజ్ఞప్తిని పక్కన పెట్టిన ఫ్రాన్స్, జర్మనీ

    438
    0
    Germany, France Ignore WHO Request, Will Give Covid Booster Shots
    Germany, France Ignore WHO Request, Will Give Covid Booster Shots

    బూస్టర్ డోస్.. డబ్ల్యుహెచ్ఓ విజ్ఞప్తిని పక్కన పెట్టిన ఫ్రాన్స్, జర్మనీ: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి టీకాలు వేసే వరకు బూస్టర్ డోస్ ను నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన విజ్ఞప్తిని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పట్టించుకోలేదు. తమ దేశ పౌరులకు కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు బూస్టర్ డోస్ ఇవ్వడానికే మొగ్గు చూపాయి. ఫలితంగా ఆయా దేశాల్లోని పౌరులు మూడవ కోవిడ్ డోస్ ను వేయించుకోనున్నారు.
    ఇప్పటికే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. టీకా వేయించుకున్న వారికీ సోకుతూ పలువురిని బలి తీసుకుంటోంది. దీనిపై పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చిన్న దేశాలకు, ఆర్ధికంగా వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్ అందే వరకు రెండు డోసులు మాత్రమే వేయాలని డబ్ల్యుహెచ్ఓ విజ్ఞప్తి చేసింది. అయితే సంపన్న దేశాలు, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న దేశాలు తమ పౌరులను అంటువ్యాధి డెల్టా వేరియంట్ నుండి రక్షించడానికే ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సెప్టెంబర్ నుండి వృద్ధులు, బలహీనమైన వారికి మూడవ కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులను అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. డెల్టా వేరియంట్ వృద్ధులకు, బలహీనమైన వారికీ అత్యంత ప్రమాదకరంగా మారిందని, అటువంటి వారికి మూడో డోస్ అవసరమని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి సెప్టెంబర్ నుండి బూస్టర్‌లను అందించాలని జర్మనీ భావిస్తోందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కనీసం సెప్టెంబర్ చివరి వరకు వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్ ను నిలిపివేయాలని, ధనిక దేశాలు ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాను ఎక్కువగా ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం అన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ వాదన ప్రకారం అధిక ఆదాయ దేశాలు ప్రతి 100 మందికి 50 మోతాదులను మేలో అందించాయి. ఆ సంఖ్య ప్రస్తుతం రెట్టింపు అయింది. తక్కువ ఆదాయ దేశాలు టీకాల సరఫరా కొరత కారణంగా ప్రతి 100 మందికి 1.5 మోతాదులను మాత్రమే అందించగలిగాయి.

    డెల్టా వేరియంట్ నుండి తమ ప్రజలను రక్షించడానికి అన్ని ప్రభుత్వాల ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని టెడ్రోస్ చెప్పారు. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లను ఎక్కువగా ఉపయోగించిన దేశాలను ఉదారత చూపాలని టెడ్రోస్ కోరారు.
    డబ్ల్యుహెచ్ఓ ఆరోపణలను జర్మనీ కొట్టిపారేసింది. తాము తమ దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇస్తూనే, పేద దేశాలకు కనీసం 30 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను కూడా విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పింది. తాము జర్మనీలోని బలహీన మైన ప్రజలకు, వృద్ధులకు మాత్రమే ముందుజాగ్రత్తగా మూడవ టీకాను అందించాలనుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం వివరించింది. అదే సమయంలో ప్రపంచంలోని వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడానికి తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. కోవిడ్ ను నిరోధించే విషయంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పటివరకు కనీసం ఒక మోతాదు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఫ్రాన్స్ 64.5% మందికి, జర్మనీ 62% వారి జనాభాలో ఇచ్చాయి. రెండో మోతాదు విషయానికొస్తే ఫ్రాన్స్ 49%, జర్మనీ 53% మంది జనాభాకు ​​టీకాలు వేశారు.

    Previous articleజగనన్న పచ్చతోరణం ప్రారంభం
    Next articleఆగస్టు 5 చరిత్రలో గుర్తుండిపోతుంది : ప్రధాని నరేంద్ర మోడీ