Home అంతర్జాతీయ వార్తలు బలప్రయోగంతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించం : తాలిబాన్లకు పలు దేశాల సూచన

బలప్రయోగంతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించం : తాలిబాన్లకు పలు దేశాల సూచన

332
0
India, Several Other Nations Won't Recognise Government By Force In Afghanistan
India, Several Other Nations Won't Recognise Government By Force In Afghanistan

బలప్రయోగంతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించం : తాలిబాన్లకు పలు దేశాల సూచన ఆఫ్ఘనిస్తాన్‌లో బలప్రయోగంతో దేశాన్ని ఆక్రమించుకున్న ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని భారతదేశం, జర్మనీ, ఖతార్, టర్కీ మరియు అనేక ఇతర దేశాలు స్పష్టం చేశాయి. యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో హింస, దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చాయి. దోహాలో ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన రెండు ప్రత్యేక సమావేశాల తర్వాత శుక్రవారం ఖతార్ విడుదల చేసిన ప్రకటనలో అత్యవసరంగా ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పలు దేశాలు అంగీకరించాయి.

గత కొన్ని రోజులుగా తాలిబాన్లు తమ దాడిని కొనసాగిస్తూ కాందహార్, హెరాత్ వంటి ఆఫ్ఘనిస్తాన్ లో కీలక, అతి పెద్ద నగరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రాదేశిక నియంత్రణను గణనీయంగా విస్తరిస్తూ 80 శాతం భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్థాన్ లో సాధ్యమైనంత త్వరగా రాజకీయ పరిష్కారం, సమగ్ర కాల్పుల విరమణకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని పలు దేశాలు కోరాయి.

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షిస్తూ ఖతార్ వేదికగా రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయి. ఆగస్టు 19న జరిగిన మొదటి సమావేశంలో చైనా, ఉజ్బెకిస్తాన్, యుఎస్, పాకిస్తాన్, యుకె, ఖతార్, యుఎన్ మరియు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ఆగస్టు 12 న జరిగిన రెండవ సమావేశంలో జర్మనీ, ఇండియా, నార్వే, ఖతార్, తజికిస్తాన్, టర్కీ, తుర్క్మెనిస్తాన్, ఐక్య రాజ్య సమితి, అమెరికా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ తరుపున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ జెపి సింగ్ ప్రాతినిధ్యం వహించారు.

నిరంతర హింస, పెద్ద సంఖ్యలో పౌరుల మరణాలు, న్యాయవ్యతిరేక హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి సమావేశంలో పాల్గొన్న దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రావిన్షియల్ రాజధానులు, నగరాలపై అన్ని దాడులపై పాల్గొన్న దేశాలు విచారం వ్యక్తం చేశాయని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. సైనిక శక్తిని ఉపయోగించడం ద్వారా విధించిన ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఆ దేశాలు పునరుద్ఘాటించాయని పేర్కొంది.

ఇరుపక్షాల మధ్య చిత్తశుద్ధితో చర్చలు జరిపిన తరువాత, ఒక ఆచరణీయమైన రాజకీయ పరిష్కారానికి కట్టుబడాలని ఆయా దేశాలు సూచించినట్లు ఖతార్ తెలిపింది. సంయుక్త పాలన, మానవ హక్కుల పట్ల గౌరవం, మహిళలు – మైనార్టీల హక్కుల పరిరక్షణకు పాటు పడాలని ఖతార్ సూచించింది. అంతర్జాతీయ చట్టాలను తాలిబన్లు గౌరవించి తక్షణమే కాల్పులను విరమించాలని ఖతార్ కోరింది.

Previous articleసినీ ప్రియులను ఖుషీ చేసే వీకెండ్ ఇది..
Next articleగోవా ద్వీప వాసుల నిరసన.. త్రివర్ణ పతాకావిష్కరణ రద్దు చేసిన నేవీ