Home జాతీయ వార్తలు ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ

ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ

656
0
NCP Chief Sharad Pawar met PM Modi
NCP Chief Sharad Pawar met PM Modi

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ శనివారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ మేరకు ఇరువురు నాయకులు కలిసిన ఫోటోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సమావేశం 50 నిమిషాల పాటు కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఎన్‌సిపి వర్గాలు స్పందిస్తూ కొత్తగా ఏర్పడిన సహకార మంత్రిత్వ శాఖ, రైతుల సమస్యలతో సహా పలు అంశాలపై ఇరువురు నాయకులు చర్చించినట్లు తెలిపాయి. ప్రధాని మోడీ మంత్రివర్గం మెగా పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు ఎన్‌సిపి అధినేత పవార్ కొత్త సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సహకార రంగానికి సంబంధించిన చట్టాలు రూపొందించామని, రాష్ట్రం రూపొందించిన చట్టంలో జోక్యం చేసుకునే హక్కుకు కేంద్రానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు వీరిరువురి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్‌సిపి మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వంలో ఉంది.

ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పలు ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల కంటే ముందే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి ని నిలువరించేందుకు పీకే ఈ సమావేశాలు చేపడుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. ప్రతిపక్షాల ఐక్యతను సాధించేందుకు వివిధ రాజకీయ పక్షాలతో పాటు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్-ప్రియంక లతో ఇటీవల భేటీ అయ్యారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్ ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాను రాష్ట్రపతి అభ్యర్థిని కానని, ఉభయ సభల్లో బలంగా ఉన్న బిజెపికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడతారు అంటూ పవార్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత సాధించడానికి చొరవ తీసుకున్న 80 ఏళ్ల పవార్ 2024 ఎన్నికల గురించి తాను ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. అయితే రాజకీయ పరిస్థితి మారుతూ ఉంటుంది అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశానికి ముందు శుక్రవారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో శరద్ పవార్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ కూడా దీనికి హాజరయ్యారు. ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.

Previous articleఅకడమిక్ క్యాలెండరు పై యుజిసి మార్గదర్శకాలు విడుదల
Next articleSuperstar Cruise ships Star Libra Ship