Home రాజకీయం ప్రతిపక్షాలతో రాహుల్ గాంధీ సమావేశం

ప్రతిపక్షాలతో రాహుల్ గాంధీ సమావేశం

316
0
Against Parties Meeting With Rahul Gandhi
Against Parties Meeting With Rahul Gandhi

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని పద్నాలుగు ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కట్టడికి వినియోగించాల్సిన పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్షాలపై ఉపయోగించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి పోయాయి. ప్రతి రోజు ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
స్పై వేర్ పెగాసస్ తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పోల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్, టిఎంసి ఎంపీ అభిషేక్ బెనర్జీ, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ అధికారులు, జర్నలిస్టులు ఉండటంతో ఇది వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు శివసేన, సిపిఐ, సిపిఎం, ఆర్‌జెడి, ఆప్, డిఎంకె నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్‌పి, తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కచ్చి, సమాజ్ వాదీ పార్టీ, ఎన్‌సిపి, నేషనల్ కాన్ఫరెన్స్, ముస్లిం లీగ్ కు చెందిన నాయకులూ కూడా సమావేశంలో భాగమయ్యాయి. ఈ 14 పార్టీల ప్రతినిధులు మధ్యాహ్నం 12.30 గంటలకు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటును నడిపించనివ్వమని ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై మంగళవారం విమర్శలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ను స్తంభింపజేస్తోందని ప్రధాని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ మంగళ వారం తొమ్మిది సార్లు వాయిదా పడింది. పార్లమెంటులో పెగసాస్ కుంభకోణం, రైతుల నిరసనలపై చర్చించడానికి కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని, ఏడు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన తరువాత ఈ రోజు సమావేశం జరిగింది. ఈ లేఖపై బిఎస్‌పి, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఐ(ఎం), ఎన్‌సిపి సంతకం చేశాయి.
“మేము, వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులం (ఎంపిలు). నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు రైతుల డిమాండ్లను పూర్తిగా తోసిపుచ్చడం వంటి కలతపెట్టే పరిణామాలను మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాము. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తల టెలిఫోన్‌లను ట్యాప్ చేయడానికి ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ను కేంద్రం దుర్వినియోగం చేసింది” అంటూ ప్రతిపక్షాలు ఈ లేఖలో పేర్కొన్నారు.
పెగాసస్ సమస్యపై చర్చ కోసం ప్రతిపక్ష పార్టీల “ఐక్య” డిమాండ్ ను అంగీకరించనందున, పార్లమెంటు పనిచేయకపోవటానికి కేంద్రమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. పెగాసస్ పై పార్లమెంటులో చర్చించాలనే డిమాండ్లు బెంగాల్ పాలక పక్షం తృణమూల్ కాంగ్రెస్ నుండి కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. పెగాసస్ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి విశ్రాంత న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఇప్పటికే మమతా బెనర్జీ నియమించారు.

Previous articleకర్ణాటక సీఎంగా బసవరాజ్ సోమప్ప బొమ్మాయి
Next articleరాధే శ్యామ్ విడుదలయ్యేది అప్పుడు కాదా?