Home జాతీయ వార్తలు పెగాసస్.. సుప్రీంను ఆశ్రయించిన యశ్వంత్ సిన్హా

పెగాసస్.. సుప్రీంను ఆశ్రయించిన యశ్వంత్ సిన్హా

498
0
Yashwant Sinha Joins Push For Pegasus Probe In Supreme Court
Yashwant Sinha Joins Push For Pegasus Probe In Supreme Court

పెగాసస్.. సుప్రీంను ఆశ్రయించిన యశ్వంత్ సిన్హా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ కుంభకోణంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ లిస్టులో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా గురువారం చేరారు. అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ పై దాఖలైన కేసును విచారించడం ప్రారంభించింది. వార్తాపత్రికల నివేదికలు సరైనవి అయితే పెగాసస్ పై ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని పేర్కొంది. భారతదేశంలో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కంపెనీ ఐఎస్ఓ తయారు చేసిన పెగాసస్ స్పై వేర్ ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని ఆరోపణలున్నాయి. వీటిపై కోర్టు పర్యవేక్షణలో విచారణను కోరుతూ, పర్యవేక్షణ యంత్రాంగాన్ని రూపొందించడానికి ఆదేశాలు ఇవ్వాలని సిన్హా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సిన్హాతో పాటు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్ మరియు శశి కుమార్ లు పెగాసస్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయంపై క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయడానికి ప్రయత్నించారా అని పిటిషనర్‌లను సుప్రీం ధర్మాసనం అడిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లలో ఒకదాన్ని ప్రతివాదులుగా పేర్కొనడాన్ని మినహాయించి, కోర్టు గురువారం కేసులను స్వీకరించింది. ఆగస్టు 10న ప్రభుత్వం నుండి ఎవరైనా హాజరయ్యేలా పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. 2019లో లీకైన ఈ వ్యవహారం అకస్మాత్తుగా ఎందుకు బయటపడిందని కూడా సుప్రీం ప్రశ్నించింది. ఎన్ రామ్, శశికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్లు విద్యావంతులు, పరిజ్ఞానం ఉన్నవారని, వారు మరిన్ని వివరాలను పిటిషన్ లో చేర్చి ఉండాల్సిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
17 గ్లోబల్ మీడియా సంస్థల పరిశోధనలో ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ మాల్‌వేర్ ఉపయోగించి సందేశాలు, కాల్‌ రికార్డులు, ఫోన్ కెమెరాలను హ్యాక్ చేసినట్లు తేలింది. అంతర్జాతీయ మీడియా కన్సార్టియంలోని భారతీయ మీడియా సంస్థ “ది వైర్” ప్రకారం, రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, జర్నలిస్టులు, విపక్ష నేతల ఫోన్‌లు హ్యాక్ అయిన జాబితాలో ఉన్నాయని కనుగొన్నారు. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. విశ్వసనీయ విచారణ కోసం పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింప జేశాయి. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చింది. హ్యాకింగ్ జాబితాలో ఉన్న ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో చదివిన ప్రకటన సరిపోతుందని పేర్కొంది. ఫోన్‌ల స్నూపింగ్‌ని పెద్ద సమస్య ఈమె కాదని చెప్పడానికి అధికార బిజెపి చాలా రోజులుగా శ్రమించింది.
పెగాసస్ అనేది ఒక నిఘా సాఫ్ట్ వేర్. దీనిని ఎన్ఎస్ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ రూపొందించింది. తమ సాఫ్ట్ వేర్ ను ఉగ్రవాద చర్యల నిరోధానికి మాత్రమే రూపొందించామని, సామాన్యులపై ఇది ఉపయోగించకూడదని ఆ సంస్థ చెబుతోంది. తాము కేవలం ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ జాబితాలో ప్రతిపక్షాల నాయకులు, న్యాయమూర్తులు, సుప్రీమ్ కోర్టు రిజిస్ట్రార్లు, జర్నలిస్టులు పేర్లు ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

For Latest News

Previous articleరజతం సాధించిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా
Next articleరెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం మొగ్గు