Home జాతీయ వార్తలు పెగాసస్ వివాదం.. విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం

పెగాసస్ వివాదం.. విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం

411
0

పెగాసస్ స్పైవేర్ వివాదంపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమర్పించిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విచారణ అవసరమని సుప్రీం వ్యాఖ్యానించింది. వచ్చే వారం పెగాసస్ పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం విచారణ జరపనుంది.
పిటిషనర్లు ఏమి చెప్పారు?
జులై 27న సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ను ఉపయోగించి ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై ప్రభుత్వ ఏజెన్సీలు నిఘా పెట్టారని ఆరోపిస్తూ, దీనిపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా స్వతంత్ర దర్యాప్తును పిటిషనర్ కోరారు. ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీలు పెగాసస్ స్పైవేర్ కోసం లైసెన్స్ పొందాయా లేదా అనే విధానం, దానిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వినియోగించారు లేదా అనే విషయాలను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని పిటిషనర్ కోరారు. మిలిటరీ-గ్రేడ్ స్పైవేర్ ఉపయోగించి దేశ పౌరులను, ప్రముఖులపై నిఘా పెట్టాడం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అని, ఇది ఆర్టికల్స్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం, ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, పౌర సమాజ కార్యకర్తలు, ప్రభుత్వ మంత్రులు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల ఫోన్‌లను లక్ష్యంగా హ్యాకింగ్ చేయడం ఆర్టికల్ 19 (1) (a) ప్రకారం కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని పిటిషనర్ వివరించారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా రాజకీయ కార్యకలాపాలను సాగించడం కోసం వినియోగించడం నేరపూరితమని పిటిషన్ లో పేర్కొన్నారు.

సమస్య ఏమిటి?
ఇద్దరు మంత్రులు, 40 మందికి పైగా జర్నలిస్టులు, ముగ్గురు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలు, భారతదేశంలో ఒక సిట్టింగ్ జడ్జితో సహా 300 మంది మొబైల్ ఫోన్ నంబర్లు స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేశారని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం నివేదించినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దేశంలోని చట్టాల ప్రకారం అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారత ప్రజాస్వామ్యాన్ని కించపరిచే, బలహీన పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది.

Previous articleసెమీస్ కు దూసుకెళ్లిన లవ్లీనా.. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయం!
Next articleసిబిఎస్ఇ ఫలితాలు విడుదల