Home రాజకీయం పెగాసస్ కు వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ ఏకం కావాలి : మమతా బెనర్జీ

పెగాసస్ కు వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ ఏకం కావాలి : మమతా బెనర్జీ

197
0
Mamatha Benarjee Fires on Central Government about Pegasus Spyware
Mamatha Benarjee Fires on Central Government about Pegasus Spyware

ఇజ్రాయెల్ కు చెందిన నిఘా వైరస్ పెగాసస్ సాయంతో ప్రతిపక్ష పార్టీ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రాలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బెంగాల్ లో అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో ఢిల్లీకి వెళ్తానని, ప్రతిపక్షాల సమావేశానికి హాజరవుతానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషించే న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియాను పెగాసస్ ద్వారా నియంత్రించడానికి కేంద్రం యత్నిస్తోందన్నారు. తన ఫోన్ కూడా టాప్ చేయబడిందేమోనన్న అనుమానం వ్యక్తం చేసిన దీదీ.. ప్రతిపక్ష నాయకులతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించారు. పెగాసస్ ఆందోళనతో తన మొబైల్ ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానని మమతా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని రక్షించగలిగేది సుప్రీం కోర్టు మాత్రమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. పెగాసస్ కుంభకోణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించి సుమోటో గా కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానిపైనా విమర్శల బాణం ఎక్కుపెట్టారు. మీరు, మీ హోమ్ మంత్రి కలిసి మాపై ఏజెన్సీలను మోహరించినా, అధికారాన్ని దుర్వినియోగం చేసినా బెంగాల్ ప్రజలు మీకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని మండిపడ్డారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బులను సంక్షేమానికి బదులు ప్రతిపక్షాల పై నిఘా కోసం ప్రధాని మోడీ వినియోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్ పై అధిక పన్నుల భారం వేసి వసూలు చేసిన రూ.3.7 లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీకాలు ఏవీ అందుబాటులో లేవని, న్యాయమూర్తుల ఫోన్లు, రాజకీయ నాయకులు, మీడియా వ్యక్తుల ఫోన్‌లను పెగసాస్ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టడానికే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆరోపించారు.

Previous articleమా యాప్ లు వినియోగించండి.. భారతీయ విద్యార్ధులపై చైనా ఒత్తిడి
Next articleసరిహద్దులో మాటు వేసిన డ్రాగన్