Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లొని హిందూ దేవాలయంపై దాడి.. 20 మంది అరెస్టు

పాక్‌లొని హిందూ దేవాలయంపై దాడి.. 20 మంది అరెస్టు

494
0
20 people arrested, over 150 booked in Pakistan for attack on Hindu temple
20 people arrested, over 150 booked in Pakistan for attack on Hindu temple

పాక్‌లొని హిందూ దేవాలయంపై దాడి.. 20 మంది అరెస్టు పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారింది. అక్కడ హిందూ దేవాలయాలపై తరచూ దాడులు, హిందూ అమ్మాయిల కిడ్నాప్-మత మార్పిడి ఇలా ఎన్నో ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇదే కోవలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామంలో హిందూ దేవాలయంపై ఇటీవల దాడి జరిగింది.

ఈ దాడికి పాల్పడినందుకు 20 మందిని అరెస్టు చేశామని, 150 మందికి పైగా కేసు నమోదు చేశామని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. దాడిని ఆపడంలో విఫలమైనందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం అధికారులపై మండిపడింది.

ఈ ఘటన విదేశాలలో దేశ ప్రతిష్టను దిగజార్చిందని గమనించి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించిన తర్వాత పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
ఎనిమిదేళ్ల హిందూ బాలుడిని ఓ కేసులో కోర్టు విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని రహీమ్యార్ ఖాన్ జిల్లా భోంగ్ ప్రాంతంలో వందలాది మంది ప్రజలు కర్రలు, రాళ్లు, ఇటుకలను తీసుకుని ఆలయంపై దాడి చేశారు. ఆలయాన్ని తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేశారు. అక్కడ మూత్ర విసర్జన చేసి ఆలయ పరిసరాలను వికృతంగా మార్చారు.

ఈ ఘటనలో దాడికి పాల్పడిన 20 మంది అనుమానితులను తాము ఇప్పటివరకు అరెస్టు చేశామని జిల్లా పోలీసు అధికారి విలేకరులతో అన్నారు. వీడియో ఫుటేజ్ ద్వారా అనుమానితులను పోలీసులు గుర్తిస్తున్నందున రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఆయన చెప్పారు. ఆలయంపై దాడి చేసినందుకు 150 మందికిపైగా ఉగ్రవాదం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అయన వెల్లడించారు.

దాడికి సంబంధించిన ప్రతి అనుమానితుడిని తాము అరెస్టు చేస్తామని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయని ఆయన చెప్పారు.


శుక్రవారం పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ, దేవాలయంలో విధ్వంసం దేశానికి సిగ్గు తెచ్చిందని, పోలీసులు నిశ్శబ్ద ప్రేక్షకుల వలె వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎనిమిదేళ్ల బాలుడిని అరెస్టు చేయడంపై న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు. సదరు హిందూ బాలుడిని విడుదల సందర్భంగా మైనర్‌ల మానసిక సామర్థ్యాన్ని పోలీసులు అర్థం చేసుకోలేకపోతున్నారా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

పాకిస్థాన్ పార్లమెంట్ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా దేవాలయ దాడిని ఖండించింది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో ఆగస్టు 13 కి వాయిదా పడింది. భారతదేశం గురువారం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులను పిలిచి, తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లోని మైనారిటీ వర్గాల మత స్వేచ్ఛ, వారి మతపరమైన ప్రార్థనా స్థలాలపై నిరంతర దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఏర్పడ్డారు.

అధికారిక అంచనాల ప్రకారం 75 లక్షల మంది హిందువులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. అయితే దేశంలో 90 లక్షల మంది హిందువులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.

For More News

Previous articleజాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి
Next articleటోక్యో ఒలింపిక్స్ : కాంస్యాన్ని సాధించిన బజరంగ్ పూనియా