Home జాతీయ వార్తలు న్యాయమూర్తిని జీపుతో ఢీకొట్టి హత్య.. ఆరా తీసిన సుప్రీం

న్యాయమూర్తిని జీపుతో ఢీకొట్టి హత్య.. ఆరా తీసిన సుప్రీం

360
0
Jharkhand judge's death: Supreme Court Bar seeks CBI probe
Jharkhand judge's death: Supreme Court Bar seeks CBI probe

ఝార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ జిల్లా న్యాయమూర్తి ఉత్తం ఆనంద్ మరణం సంచలనం రేపుతోంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయనను ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తు మరణించారని తొలుత అంతా భావించారు. అనంతరం సమీపంలోని సిసి కెమెరాను పరిశీలించగా ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు స్పష్టమైంది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఝార్ఖండ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడారు. కేసును తామే విచారించనున్నట్లు తెలిపారు.
ధనబాద్ జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ లో ఉండగా అతివేగంగా టెంపో ఢీకొనడంతో మృతి చెందాడు. కొన్ని గంటల తరువాత, సిసిటివి ఫుటేజీ ఆధారంగా జరిపిన దర్యాప్తుతో ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమైంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తుండగా, న్యాయమూర్తి మరణానికి కొన్ని గంటల ముందు టెంపో దొంగిలించబడిందనే వాస్తవం బయట పడింది. ఇంతలో ఈ విషయం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేయవలసిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వద్ద ప్రస్తావించారు. మొదట జస్టిస్ డి.వై.చంద్రచుడ్, తరువాత సిజెఐ ముందు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సంఘటనను సుమోటోగా తీసుకోవాలని వికాస్ సింగ్ సుప్రీంకోర్టును ఒత్తిడి చేశారు. సిసిటివి ఫుటేజ్ ప్రకారం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఒక పథకం ప్రకారమే న్యాయమూర్తిని అంతమొందించారని వికాస్ సింగ్ వాదిస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం పై దాడిగా అభివర్ణించారు. గురువారం సుప్రీమ్ కోర్టు విచారణ ప్రారంభమైన అనంతరం జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు ఈ అంశాన్ని వికాస్ సింగ్ ప్రస్తావించారు. అనంతరం ఈ విషయాన్ని సిజెఐ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లి, హత్యోదంతంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. దీనిపై సిజెఐ ఎన్వి రమణ స్పందిస్తూ గురువారం ఉదయం జార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడినట్లు చెప్పారు. హైకోర్టు పోలీసులకు, జిల్లా అధికారులకు నోటీసు జారీ చేసిందని, ప్రస్తుత దశలో సుప్రీం జోక్యం అవసరం లేదని చెప్పారు. ఝార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి విచారణ వేగవంతంగా జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం సాయంత్రం ఈ సంఘటనను గుర్తించారు. దీనిపై నివేదిక ఇవ్వడానికి సీనియర్ పోలీసులు, జిల్లా అధికారులను గురువారం ఉదయం కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

Previous articleకేరళపై కరోనా పడగ.. వారాంతపు లాక్‌డౌన్‌ విధింపు
Next articleబ్యాంకింగ్ నూతన పాలసీలు గురించి తెలుసా?