Home జాతీయ వార్తలు “నీట్”తో.. వైద్య విద్యకు పేదలు దూరం : మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.కె.రాజన్

“నీట్”తో.. వైద్య విద్యకు పేదలు దూరం : మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.కె.రాజన్

847
0
Ex-Judge Submits Report To Tamil Nadu Government
Ex-Judge Submits Report To Tamil Nadu Government

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కొనసాగితే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.కె.రాజన్ అన్నారు. ఫలితంగా సమీప భవిష్యత్తులో గ్రామీణ తమిళనాడులోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వైద్యులు ఉండరని చెప్పారు. తమిళనాడులో మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన డేటా అధ్యయనం, వెనుకబడిన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన సిఫార్సులు చేయడానికి ఈ ప్యానెల్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తమ అధ్యయనాన్ని రాష్ట్రప్రభుత్వానికి మాజీ న్యాయమూర్తి ఎ.కె.రాజన్ నేతృత్వంలోని కమిటీ శనివారం సమర్పించింది. అనంతరం తమ నివేదికపై ఓ ఆంగ్ల ఛానల్ తో ఆయన మాట్లాడారు. నీట్ ద్వారా ధనవంతులు మాత్రమే ఎక్కువ సీట్లు పొందుతారని అన్నారు. స్థానిక విద్యార్థులకు వైద్య విద్య దక్కనప్పుడు, సంపన్న ప్రాంతాల ప్రజలు, ఇతర ప్రాంతాల వారు స్థానికంగా వైద్యులుగా పని చేయరని చెప్పారు.

తమిళనాడు మినహా మిగతా అన్ని రాష్ట్రాలు నీట్‌ను అంగీకరించిన విషయం గుర్తు చేయగా, ఇతర రాష్ట్రాలు త్వరలోనే తమ విధానాన్ని సమర్ధిస్తాయని చెప్పారు. అనేక సమస్యలపై తమిళనాడు తొలుత గొంతెత్తి, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహిస్తోందని చెప్పారు. ఇంతకుముందు తాము మాత్రమే హిందీని వ్యతిరేకించామని, కాని ఇప్పుడు ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. తమకు నీట్ ను వ్యతిరేకిస్తూ 86 వేల వినతులు వచ్చాయని, ఇది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తోందని అన్నారు.
రిజర్వేషన్లు ఉన్నప్పటికీ పట్టణ సంపన్న విద్యార్థుల మాదిరిగా పేద, గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ పొందలేకపోతున్నారని రాజన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కేంద్రాలు కూడా లేవని గుర్తు చేశారు. నీట్ తప్పనిసరి కావడానికి ముందు, అధిక సంఖ్యలో పేద విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం పొందగలిగారన్నారు. వారు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా వచ్చారని చెప్పారు.

అధికార డిఎంకె, ప్రధాన ప్రతిపక్షమైన ఎఐఎడిఎంకెతో సహా చాలా పార్టీలు నీట్‌ ను వ్యతిరేకిస్తున్నాయి. సామాజిక న్యాయం, గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యతిరేకంగా నీట్ ఉందని వాదిస్తూ, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. యుపిఎ పాలనలో నీట్ నుంచి డిఎంకె ప్రభుత్వం మినహాయింపు పొందింది. 2011 నుంచి పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఎఐఎడిఎంకె నీట్ మినహాయింపు కోరినప్పటికే బిజెపి నిరాకరించింది.

Previous articleశాంతికాముకులమే.. కవ్విస్తే తగిన రీతిలో జవాబు : అమిత్ షా
Next article“పెగాసస్”పై పార్లమెంట్ లో అలజడి