Home రాజకీయం నన్ను వ్యతిరేకించే వారి వల్లే నా ఎదుగుదల : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ

నన్ను వ్యతిరేకించే వారి వల్లే నా ఎదుగుదల : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ

225
0
Sidhu and Amarinder on same Stage
Sidhu and Amarinder on same Stage

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అమరీందర్ తో సహా, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో గత కొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ లో ఇద్దరు అగ్ర నాయకుల మధ్య నెలకొన్న వివాదం నేటితో సమసిపోయినట్లు కనిపించింది. తన ప్రమాణ స్వీకార వేడుకకు ముందు పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇచ్చిన టీ పార్టీకి సిద్ధూ హాజరయ్యారు. ఇక ఆరు నెలల్లో పార్టీని ఎన్నికల క్షేత్రంలో విజేతగా నిలపడమే సిద్ధూకు అతి పెద్ద సవాలుగా ఉంది.

ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత ఉందని, ప్రతిపక్షాలు తమ సఖ్యతపై ఎన్ని విరుద్ధ ప్రకటనలు చేసినా తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. తాను అందరితో కలిసి పని చేస్తానని, తనకు అహంభావం లేదని చెప్పారు. నన్ను వ్యతిరేకించే వారి వల్లే తాను మరింత రాటుదేలుతానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఉప్పూనిప్పుగా వ్యవహరించిన అమరీందర్-సిద్ధూ లు ఒకే వేదికను పంచుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన ప్రమాణ స్వీకారానికి వచ్చి, అందరినీ ఆశీర్వదించాలని సింధు లేఖలో కోరడంతో, మన్నించిన అమరీందర్ ఈ వేడుకకు హాజరయ్యారు. తనకు వ్యక్తిగత అజెండా లేదని, పంజాబ్ సమస్యల పరిష్కారంపైనే తన సంకల్పం, నిబద్ధత ఉందని లేఖలో సిద్ధూ పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలో పెద్దవాడిగా, దయచేసి కొత్త జట్టుకు వచ్చి ఆశీర్వదించమని సిద్దూ అభ్యర్ధించడంతో వివాదానికి తెరపడింది.

Punjab PCC Chief Sidhu

ఈ వారం ప్రారంభంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నియమించబడటానికి ముందే సిద్దూ-అమరీందర్ సింగ్ మధ్య వివాదం నెలకొంది. తనపై గతంలో అవమానకరమైన ట్వీట్ చేసినందుకు, క్రికెటర్ గా మారిన రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పే వరకు తాను ఆయనను కలవబోనని సిద్ధూను ఉద్దేశించి అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పంజాబ్ యూనిట్ నూతన అధ్యక్షుడిగా నవజోత్ సిద్ధును నియమించిన తరువాత, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప అమరీందర్ సింగ్‌కు వేరే మార్గం లేకపోయింది. 2015 కోట్కాపురా పోలీసుల కాల్పుల సంఘటనపై దర్యాప్తు నివేదికను పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అమరీందర్ సింగ్, నవజోత్ సిద్దూ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. కేసులో న్యాయం జరగడంలో ఆలస్యం జరిగిందని, పోలీసుల కాల్పుల సంఘటనలపై సిఎం అమరీందర్ సింగ్‌ను విమర్శిస్తూ నవజోత్ సిద్ధు మాటల దాడి చేశారు. ఇక తనను పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తరువాత నవ్‌జోత్ సిద్దూ బలప్రదర్శనకు దిగారు. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. స్వర్ణ దేవాలయంలో ప్రార్థన చేయడానికి 62 మంది ఎమ్మెల్యేలను చండీగర్ నుంచి అమృతసర్ కు తీసుకెళ్లారు. ఈ బృందంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా సిద్ధూ ప్రమాణ స్వీకారానికి బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. వారందరికీ నూతన కాంగ్రెస్ కమిటీ సమావేశం ప్రారంభంలో కొద్ది నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది.

Previous articleఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం
Next articleఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల