Home Covid 19 జైడస్ టీకా.. చిన్నారులకు సంజీవనిలా మారనుందా?

జైడస్ టీకా.. చిన్నారులకు సంజీవనిలా మారనుందా?

198
0
Jaidus Caddila Vaccine for Child
Jaidus Caddila Vaccine for Child

కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే సమర్ధంగా ఎదుర్కొనేలా కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహాలు రచిస్తోంది. అక్టోబర్ నాటికి థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలను దృష్టిలో ఉంచుకుని వారికీ వాక్సినేషన్ అందించేలా చర్యలు తీసుకుంటోంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు రెండో దేశీయ టీకా అయిన జైడస్ క్యాడిలాను అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నుంచి యుద్ధ ప్రాతిపదికన చిన్నారులకు వ్యాక్సినేషన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే చిన్నారుల ఆరోగ్యానికి మరింత రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు రూపొందించేందుకు ప్రయోగాలు ముమ్మరమయ్యాయి. ఇక చిన్నారులు కరోనా కోరలకు చిక్కకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గమని కేంద్రం యోచిస్తోంది. దీంతో ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల కమిటీ అధ్యక్షుడు ఎన్ కె అరోరా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాలను వెల్లడించారు.
చిన్నారులపై జైడస్ వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు వచ్చాయి. వాటి ఫలితాలు వచ్చిన వెంటనే జైడస్ క్యాడిలాకు కేంద్రం అత్యవసర అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది. అవికూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మరిన్ని దేశీయ టీకాలు, విదేశీ టీకాలు అందుబాటులోకి వస్తే చిన్నారులను కరోనా కబళించకుండా కాపాడేందుకు రక్షణ కవచంలా అవి నిలవనున్నాయి. జనవరి నాటికి రెండేళ్లు దాటిన చిన్నారులకు సైతం టీకా అందించేలా ప్రయోగాలు సాగుతున్నాయి. థర్డ్ వేవ్ వస్తే సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 736 జిల్లాలలో నాలుగు వేల హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవ్య ఇటీవలే ప్రకటించారు.

Previous articleకారు ఎక్కనున్న ఎల్ రమణ
Next articleగోప్యతా విధానంపై.. వెనక్కి తగ్గుతున్నాం : వాట్సాప్