Home తెలంగాణ జలదిగ్బంధనంలో.. భాగ్య నగరం

జలదిగ్బంధనంలో.. భాగ్య నగరం

244
0
Heavy Rains in Hyderabad
Heavy Rains in Hyderabad

మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. ఏ గల్లీ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. చిన్న చినుకు కురిస్తేనే చిగురుటాకులా అయిపోయే హైదరాబాద్.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. గతేడాది చవిచూసిన చేదు జ్ఞాపకాలను మరోసారి కళ్ళ ముందు నిలిపింది. బుధవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మహా నగరం నీట మునిగింది. నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, ఇళ్ళు వరద నీటిలో మునిగి దర్శనమిస్తున్నాయి. అటు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలు స్తంభించాయి. చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాబోయే 48 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉప్పల్ లో 21.2 సెం.మీ. వర్షం కురవగా, అబ్దుల్లాపూర్ మెట్ 20 సెం.మీ., వనస్థలిపురం 19.2 సెం.మీ., హస్తినాపురం 19 సెం.మీ., పెద్ద అంబర్ పేట్ 18 సెం.మీ., సరూర్ నగర్ 17.9 సెం.మీ., హయత్ నగర్ 17.2 సెం.మీ., రామంతాపూర్ 17.1సెం.మీ., హబ్సిగూడ 16.5సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
ముంపులో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు బయల్దేరిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరద నీటిలో చిక్కుకు పోయారు. వర్షం నీటిలో ఆయన కారు మొరాయించింది. తన సహాయక సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది ఎమ్మెల్యే కారును వరదనీటి లో నుంచి నెట్టేందుకు ప్రయత్నించారు. వీరికి సహాయంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కిందికి దిగి కారును నెట్టారు. ఎటు చూసినా మోకాలు లోతు నీటిలో నగరం దర్శనమిస్తోంది. దీంతో సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నమయ్యారు.

Previous articleసుప్రీం చెప్పిన కొన్ని గంటల్లోనే.. రైతులపై దేశద్రోహం కేసు!
Next articleసురేఖ సిక్రీ కన్నుమూత.. విషాదంలో బుల్లి తెర వీక్షకులు