Home క్రీడలు జయహో భారత్.. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు

జయహో భారత్.. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు

400
0
India won the Olympic bronze medal in Tokyo
India won the Olympic bronze medal in Tokyo
జయహో భారత్.. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు:  ఒలింపిక్స్ లో హాకీలో ఒకప్పుడు మనదే హవా. ఇప్పటి వరకు ఎనిమిది బంగారు పతకాలతో చరిత్రలో సువర్ణ అధ్యాయం మనది. అయితేనేం.. అదంతా ఒకప్పుడు. దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించిన తరువాత భారత హాకీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. దాదాపు 41 ఏళ్లుగా స్వర్ణం మాట పక్కన పెడితే.. ఏ ఒక్క పతకము రాలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తరువాత టోక్యో ఒలింపిక్స్ లో భారత్ దుమ్ము రేపింది. సెమి ఫైనల్ లో పరాజయం పాలైనా.. కాంస్య పతక పోరులో దుర్బేధ్యమైన జర్మనీ జట్టును ఓడించి కాంస్యాన్ని ముద్దాడింది. దీంతో యావత్ భారతావని పులకించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ పతకం కోసం 41 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత హాకీలో పతకం లేని లోటును ప్రస్తుత హాకీ జట్టు తీర్చింది. గురువారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో నాలుగు సార్లు ఛాంపియన్ జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. సిమ్రన్ జీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ సాధించగా, హర్మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ పెనాల్టీ కార్నర్ల నుండి స్కోర్ చేశారు. ఆధిక్యం చేతులు మారుతూ తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో భారత్ పట్టు సడలని పోరాటంతో విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది నాలుగో కాంస్య పతకం. మన జట్టు చివరిగా 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఎనిమిది బంగారు పతకాలతో పురుషుల హాకీలో ఒలింపిక్స్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది.
తొలి క్వార్టర్ లో జర్మనీ జట్టు ఆటగాడు ఒరుజ్ కొట్టిన గోల్ తో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ అధిక్యంతోనే ఆ జట్టు తొలి క్వార్టర్ ను ముగించింది. తొలి క్వార్టర్ లో గోల్ చేయని భారత జట్టు ప్రత్యర్థితో నువ్వా నేనా అన్నట్లు తలపడింది. దూకుడు పెంచిన మన జట్టు 17వ నిమిషంలో సిమ్రన్ జిత్ కౌర్ గోల్ చేయడంతో స్కోరును 1-1 తో సమం చేసింది. ఇదే సమయంలో ఒక్కసారిగా జర్మనీ జట్టు విజృంభించింది జర్మనీ తరుపున వెలెన్, బెనెడిక్ట్ వరుస గోల్స్ చేయడంతో జర్మనీ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయినా నిరాశ చెందని భారత జట్టు ప్రత్యర్థిపై దాడులు కొనసాగించింది. ఈ క్రమంలో 27వ నిమిషంలో హార్దిక్ సింగ్, 29వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ గోల్స్ చేయడంతో 3-3 తేడాతో స్కోరును సమం చేసింది. అనంతరం మూడో క్వార్టర్ లో పదే పదే జర్మనీ జట్టును భారత్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ 31వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్, సిమ్రన్ జిత్ కౌర్ తన రెండో గోల్ ను 34వ నిమిషంలో సాధించి భారత్ కు జర్మనీపై ఆధిక్యం సంపాదించి పెట్టారు. ఫలితంగా 5-3 ఆధిక్యంతో భారత్ మూడో క్వార్టర్ ను ముగించింది. ఇక ఆఖరి నాలుగో క్వార్టర్ లో ఇరు జట్లు ఉత్తమ ఆటతీరును కనబరచడంతో పోరు రక్తికట్టింది. భారత్ కు లభించిన పెనాల్టీ కార్నర్ లు వృధా అయ్యాయి. ఇదే సమయంలో మరో మూడు నిమిషాల్లో ఆట ముగిసే సమయంలో జర్మనీ విజృంభించింది. జర్మనీ ఆటగాడు విండ్ ఫెదర్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 5-4కు తగ్గించాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జర్మనీకి మరో పెనాల్టీ కార్నర్ లభించడంతో స్కోర్లు సమం అవుతాయేమో అన్న అనుమానం తలెత్తింది. అయితే భారత గోల్ కీపర్ శ్రీజేష్ దానిని సమర్ధంగా అడ్డుకోవడంతో చివరికి 5-4 తేడాతో భారత్ విజయం సాధించింది.
For latest news
Previous articleఅయోధ్య రామమందిరంలో భక్తుల ప్రవేశం.. 2023 డిసెంబర్ లోనే!
Next articleపంజాబ్ రాష్ట్ర సలహాదారుగా పీకే రాజీనామా.. దేనికి సంకేతం?