Home తెలంగాణ ఛలో రాజభవన్.. కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

ఛలో రాజభవన్.. కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

205
0
T Congress Chalo Raj Bhavan
T Congress Chalo Raj Bhavan

పెట్రో ధరలు, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిమిత్తం కాంగ్రెస్ శ్రేణులు భాగ్యనగరానికి తరలి వచ్చాయి. రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. దీంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు తొలుత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమను అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఛలో రాజ్ భవన్ ను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం తన ఇంటి నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు రేవంత్ రెడ్డి చేరుకుని సభలో మాట్లాడారు. పెట్రో ధరలను ఇబ్బడిముబ్బడి గా పెంచారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ పెద్ద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, త్యాగం, చావులు తెలంగాణ బిడ్డలవని అన్నారు. అయితే అధికారం అనుభవించేది కెసిఆర్ కుటుంబమేన్నారు. రూ.35గా పెట్రోలు రేటు ఉందని, దానిపై రూ. 66 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు దోపిడీతో రూ. 105 కు అమ్ముతున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, పేద దేశాల్లో కూడా లేని విధంగా కేవలం భారత దేశంలోనే ఎక్కువ ధరకు పెట్రోలు, డీజిల్ ను అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుని మీద కెసిఆర్ రూ. లక్ష అప్పు పెడితే, ప్రధాని హోదాలో మోడీ రూ. 5 లక్షలు ప్రతి భారతీయని నెత్తి మీద అప్పు పెట్టారని చెప్పారు. రానున్నది సోనియమ్మ రాజ్యమని, కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యమని చెప్పారు. తమను వేధించే పోలీసు అధికారులను మర్చిపోమని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారందరికీ తగిన రీతి బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్, బిజెపి కి చెందిన నాయకులు రోడ్ల మీద పొర్లుతుంటే పట్టించుకోని పోలీసులు.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను మాత్రం నిర్బంధిస్తున్నారన్నారు. యూపీఏ హయాంలో పెట్రో ధరలను పైసల్లో పెంచితే, బిజెపి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రూపాయల్లో పెంచిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ కు పాదయాత్ర చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అంతకు ముందు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సభలో మాట్లాడారు.
అనంతరం ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ లేరని పోలీసులు చెప్పడంతో ట్యాంక్ బండ్ వరకు వెళ్లి అంబెడ్కర్ విగ్రహానికి తమ వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. రేవంత్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వైపులా నుంచి తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు వెళ్లడంతో వారిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో తోశారు. అతి కష్టం మీద రేవంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో రాజ్ భవన్ కు వెళ్లే దారుల్లో పోలీసులు బారికేడ్లు, ఐరన్ ఫెన్సింగ్ లు వేశారు. రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ కి చెందిన జెండాలు కట్టారు. ఇందిరా భావం నుంచి రాజ్ భవన్ కు కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

Previous articleసురేఖ సిక్రీ కన్నుమూత.. విషాదంలో బుల్లి తెర వీక్షకులు
Next articleకన్వర్ యాత్రను రద్దు చేయండి : యూపీ ప్రభుత్వానికి సుప్రీం సూచన