Home రాజకీయం కొనసాగింపా? ఉద్వాసనా? : కర్ణాటక సిఎం పదవిపై ఊహాగానాలు

కొనసాగింపా? ఉద్వాసనా? : కర్ణాటక సిఎం పదవిపై ఊహాగానాలు

286
0
Ongoing suspense over Karnataka CM post
Ongoing suspense over Karnataka CM post

కర్నాటక ముఖ్యమంత్రిగా యెడియూరప్ప ను బిజెపి అధిష్టానం కొనసాగించనుందా? లేక స్వపక్షంలో నిరసనల కారణంగా సాగనంపుతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవికి యెడియూరప్ప రాజీనామా చేశారని, లేఖను నేరుగా ప్రధానికి అందజేశారని ఆయన వ్యతిరేక వర్గాల నుంచి వదంతులు గుప్పుమన్నాయి. తన కుమారులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత దక్కాలనే కండిషన్లను ప్రధాని, పార్టీ ముందు ఉంచారని వార్తలు వచ్చాయి. ఢిల్లీ పర్యటనలో ఆయనతో పాటు ఆయన కుమారులు కూడా దర్శనమివ్వడంతో వదంతులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే వీటన్నింటినీ యెడియూరప్ప తోసిపుచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరింత ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి.
బిజెపి శాసనసభ పక్ష సమావేశానికి ఒక రోజు ముందు జూలై 25 న ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప తన నివాసంలో సీనియర్ అధికారులు, సెక్రటేరియట్ సిబ్బందికి భోజనం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిగా ఆయన త్వరలో రాజీనామా చేయనున్నారని, ఆ నేపథ్యంలోనే ఈ విందు ఇస్తున్నారని పలువురు యోచిస్తున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సమావేశం తరువాత బిజెపి ఎమ్మెల్యేలకు భోజనం ఏర్పాటు చేయాలని యెడియూరప్ప భావిస్తున్నారని, తరువాత విధాన సౌధలో ఫోటో సెషన్ జరుగుతుందని చెప్పారు. దీనికి కొన్ని రోజుల ముందు, జూలై 23 లేదా 24 తేదీలలో, ముఖ్యమంత్రి తన సొంత జిల్లా శివమొగ్గను సందర్శించి, అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు. నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న తరుణంలో యెడియూరప్ప ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో పాటు, పార్టీ పెద్దలను కలవడం, అనంతరం తన పర్యటన గురించి మాట్లాడుతూ తన యాత్ర విజయవంతమైందని, తనను పక్కకు తప్పుకోమని పార్టీ పెద్దలు కోరతారనే మాటను కొట్టిపారేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయానికి నడిపించే బాధ్యతను హైకమాండ్ తనకు ఇచ్చిందని ఆయన మీడియాతో చెప్పారు. జూలై 26 సమావేశంలో రాజీనామా చేసే నిర్ణయాన్ని ఆయన ప్రకటించవచ్చని బిజెపి కార్యకర్తలలో ఒక విభాగం అభిప్రాయపడింది. కానీ ఆయన బయటికి వెళ్తున్నాడనే వదంతులను యెడియూరప్ప విధేయులు ఖండించారు. యెడియూరప్ప పోరాట యోధుడు, ఆయన అంత తేలికగా వెళ్ళడంటూ ఒక సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాజకీయ వర్గాలలో ఒక సిద్ధాంతం ఏమిటంటే ఆషాడ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 వరకు యెడియూరప్ప ఎటువంటి ప్రకటన చేయకుండా ఉంటారని చెబుతున్నారు.
మరోవైపు యెడియూరప్పకు ఊహించని మద్దతు లభిస్తోంది. యెడియూరప్పను గౌరవంగా చూడాలని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ జల వనరుల మంత్రి ఎంబి పాటిల్ బిజెపిని కోరారు. “సమాజంలోని ఉన్నత స్థాయి నాయకుడిని (పార్టీ) దుర్వినియోగం చేస్తే బిజెపి లింగాయత్‌ల కోపాన్ని చవిచూస్తోంది. బిజెపి ఆయన చేసిన కృషికి విలువ ఇవ్వాలి, గౌరవంగా వ్యవహరించాలి” అని ట్వీట్ చేశారు. మరో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశైవ లింగాయత్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న షమనూర్ శివశంకరప్ప యెడియరప్పను కలిశారు. ఈ సందర్భంగా యెడియూరప్పను బయటకు పంపిస్తే బిజెపి రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని, ఆయన మొదటి నుండి పార్టీని నిర్మించారని చెప్పారు. లింగాయత్ సంఘం ఆయనను కొనసాగించాలని కోరుకుంటోందని, వీరశైవసభ ఆయనకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాలేహోన్నూర్‌లోని రంభపురి మఠానికి చెందిన ప్రముఖ లింగాయత్ సీర్ జగద్గురు ప్రసన్న రేణుక శివచార్య స్వామి కూడా యెడియూరప్పకు మద్దతు ప్రకటించారు. పదవీకాలం పూర్తయ్యేంత వరకు యెడియూరప్పను కొనసాగించాలని సూచించారు.
ఇదిలావుండగా కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Previous articleశిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు
Next article“బెంగాల్ హింస”పై రేపు ఢిల్లీలో బీజేపీ ధర్నా