Home Covid 19 కేరళపై కరోనా పడగ.. వారాంతపు లాక్‌డౌన్‌ విధింపు

    కేరళపై కరోనా పడగ.. వారాంతపు లాక్‌డౌన్‌ విధింపు

    443
    0
    Daily Covid-19 Cases Kerala Top in Country
    Daily Covid-19 Cases Kerala Top in Country

    రోజువారీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుతుండగా కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో ఉంది. దీంతో పరిస్థితిని నివారించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. కేసుల పెరుగుదలపై అధ్యయనం చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. కేరళలో ఇంకా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున, కోవిడ్ నిర్వహణలో రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు ఈ బృందం సహాయం చేస్తుందని మాండవియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు స్పందిస్తూ కేసుల చికిత్స కంటే ఉపశమన ప్రక్రియపై రాష్ట్రం ఎక్కువ దృష్టి పెట్టిందని వివరించారు.

    Corona Virus
    Corona Virus

    గత వారం ఈద్-ఉల్-అజా కోసం మూడు రోజుల సడలింపు ప్రకటించిన కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చురకలు అంటించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల అక్కడ గమనించిన సూపర్ స్ప్రెడర్ సంఘటనలపై రాష్ట్రానికి లేఖ రాశారని, కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నిర్వహణకు గతంలో ఉత్తమ పద్ధతులు పాటించి ప్రశంసలు పొందిన ఈ దక్షిణాది రాష్ట్రం ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది.
    రాష్ట్రంలో రోజువారీ సగటు కేసులు 17,443 పైన ఉన్నాయి. ఆరు జిల్లాలు వారానికి 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటును నమోదు చేస్తున్నాయి. కేరళలో కోవిడ్ పునరుత్పత్తి రేటు, ఈ నెల ప్రారంభంలో థర్డ్ వేవ్ వచ్చిందేమోనన్న ఆందోళనలను రేకెత్తించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే కేరళ రాష్ట్రం చాలా వేగంగా టీకాలు వేస్తున్నప్పటికీ, కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. జూన్ 14 నుంచి జూలై 6 మధ్య జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చేసిన సెరో సర్వే ప్రకారం, కేరళలో 44.4 శాతం తక్కువ కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. కేరళలో బుధవారం 22,056 తాజా కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. 131 మంది మహమ్మారి కారణంగా మరణించారు.

    Previous articleచేయి చేయి కలుపుదాం.. బిజెపిని ఓడిద్దాం : సోనియాతో మమత భేటీ
    Next articleన్యాయమూర్తిని జీపుతో ఢీకొట్టి హత్య.. ఆరా తీసిన సుప్రీం