Home తెలంగాణ కారు ఎక్కనున్న ఎల్ రమణ

కారు ఎక్కనున్న ఎల్ రమణ

120
0
L Ramana Joins in TRS
L Ramana Joins in TRS

టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపారు. 30 ఏళ్లుగా తన రాజకీయ ఎదుగుదలకి తోడ్పడినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక టిఆర్ఎస్ లో మరో రెండు రోజుల్లో చేరనున్నట్లు మీడియాకు అధికారికంగా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న టిఆర్ఎస్ లో తాను భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని, కెసిఆర్ తనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు.
టిడిపికి చెందిన ఎల్ రమణను టిఆర్ఎస్ లో చేరేలా ఒప్పించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని రోజులుగా మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ తో ఎల్ రమణ గురువారం భేటీ అయ్యారు. సీఎం వద్దకు రమణను మంత్రి ఎర్రబెల్లి తోడుకొని వెళ్లారు. ప్రగతిభవన్ వేదికగా వీరి మధ్య చర్చలు జరిగాయి. ఏడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అమలు వంటి విషయాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడినా అభివృద్ధిలో కుంటుపడ్డాయని, తెలంగాణ మాత్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామాజిక తెలంగాణ పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కలిసి రావాలని రమణను కెసిఆర్ కోరగా, ఆయన అందుకు అంగీకరించారు. ముఖ్యంగా పద్మశాలి సామజిక తరగతికి చెందిన రాష్ట్రనాయకుడు రమణ స్థాయిలో లేరని, ఆయనతో ఆ లోటును భర్తీ చేసుకోవాలని కెసిఆర్ భావించారు. అనుకున్నదే తడవుగా మంత్రి ఎర్రబెల్లిని రమణ వద్దకు పంపగా పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.


టీడీపీకి సారధి ఎవరు?
రాష్ట్రం విడిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. ఫలితంగా తెలంగాణలో ఆ పార్టీ ఢీలా పడింది. ఆ పార్టీకి చెందిన నాయకులూ ఒక్కొక్కరుగా వివిధ పార్టీలకు వలస వెళ్లారు. వివాదరహితునిగా, పార్టీ విధేయునిగా కొనసాగిన ఎల్ రమణ రాజీనామా ఆ పార్టీకి తీరని లోటని చెప్పొచ్చు. ఈ సమయంలో అగ్రశ్రేణి నాయకులంతా వివిధ పార్టీల్లో చేరడంతో ఆ పార్టీకి తెలంగాణలో సారథ్యం వహించేది ఎవరు అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏదేమైనా పార్టీ పరిస్థితిపై చంద్రబాబు దృష్టి సారించకుంటే ప్రతిపక్షాలు విమర్శించినట్టే పార్టీ తెలంగాణాలో కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

Previous articleరగులుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం
Next articleజైడస్ టీకా.. చిన్నారులకు సంజీవనిలా మారనుందా?