Home అంతర్జాతీయ వార్తలు కాబూల్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం

కాబూల్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం

146
0
The reigning silence in Kabul
The reigning silence in Kabul

కాబూల్ లో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం : నాలుగు రోజుల క్రితం అఫ్గాన్ రాజధానిని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పడు ఇతర దేశాల ప్రజలు, అధికారులు, సైనికులు త్వరిత గతిన తమ దేశాలకు తరలి పోయారు. అయితే ఇప్పటి వరకు వారికి మద్దతుగా నిలిచిన ఆఫ్ఘన్ ప్రజలు, తాలిబన్లు తమను ఇబ్బంది పెడతారని భావించిన స్థానికులు గగ్గోలు పెట్టారు. కాబుల్ విమానాశ్రయానికి కట్టు బట్టలతో చేరుకొని, దొరికిన విమానం ఎక్కి కూర్చున్నారు. చోటు దొరకని వారు విమానం టైర్లను, రెక్కలను పట్టుకుని ప్రయాణించి, చివరికి కిందపడి ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారక పరిస్థితులే కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో దర్శనిమిచ్చాయి.

అయితే ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్ అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. శరవేగంగా తాలిబాన్ దళాలు ఆదివారం కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి నగరం అంతటా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఏదేమైనా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ – ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు, తమ కార్యాలయాలకు హాజరు కావాలని, వారి పనిని కొనసాగించాలని తాలిబాన్ పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఎక్కువ శాతం మూసి వేసి ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

మంగళవారం సాయంత్రం, తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్, కాబూల్‌లోకి ప్రవేశించిన తర్వాత తన మొదటి విలేకరుల సమావేశంలో, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు తమ సాధారణ విధులను తిరిగి కొనసాగించాలని పిలుపునిచ్చారు. వారి ప్రాణాలు, ఆస్తులు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. యుఎస్ నేతృత్వంలోని దళాలకు వ్యతిరేకంగా తాలిబాన్ యొక్క 20 సంవత్సరాల యుద్ధాన్ని సమర్థిస్తూ, ముజాహిద్ తాము ఆక్రమించిన విదేశీ శక్తులను ఓడించామని, దేశాన్ని విదేశీ ఆక్రమణ నుండి విముక్తి చేశామని చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో సుదీర్ఘమైన యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన ముజాహిద్, “ఇస్లామిక్ ఎమిరేట్ (ఆఫ్ఘనిస్తాన్)” ఎవరితోనూ శత్రుత్వం లేదని, మాజీ శత్రువులు – ఆఫ్ఘన్ జాతీయ రక్షణ మరియు భద్రతా దళాలతో సహా అన్ని ఆఫ్ఘన్‌లకు సాధారణ క్షమాభిక్ష ప్రకటించినట్లు చెప్పారు. సైన్యం, పోలీసులతో సహా మాజీ ప్రభుత్వ ఉద్యోగులు మాతృభూమిలో ఎలాంటి భయం లేకుండా జీవించవచ్చని పేర్కొన్నారు. విదేశీ దౌత్య కార్యకలాపాలు, యుఎన్ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు తమ పనిని కొనసాగించవచ్చని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు విస్తృతమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఆయన హామీ ఇచ్చారు.

కొన్ని దేశాల ఆందోళనలను ప్రస్తావిస్తూ, ముజాహిద్ విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ సమాజం, మన పొరుగువారు మరియు ప్రాంతీయ దేశాలు, యుఎస్‌కు తాము హామీ ఇస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశానికి వ్యతిరేకంగా పని చేయదని చెప్పారు. ఇస్లామిక్ ఎమిరేట్ (ఆఫ్ఘనిస్తాన్) మహిళల హక్కులను గౌరవిస్తుందని ప్రకటించారు. మహిళలు షరియా లేదా ఇస్లామిక్ చట్టం పరిధిలో విద్య, ఆరోగ్యం, ఇతర రంగాలలో పని చేయొచ్చని తెలిపారు.

మే 1 నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ దళాలు వైదొలగడం ప్రారంభించినప్పటి నుండి, తాలిబాన్లు ఆఫ్ఘన్ దళాలపై పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించారు. గత రెండు వారాల్లో మిలిటరీ గ్రూప్ కాబూల్ రాజధానితో సహా అఫ్గానిస్తాన్ భూభాగాలను మెరుపు దాడులతో స్వాధీనం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల మధ్య, కొంతమంది కాబూల్ నివాసితులు మరొక యుద్ధం ప్రారంభమవుతుందనే భయంతో ఉన్నారు. అనిశ్చిత స్థితిలో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.

చాలా మంది మాజీ యుద్దవీరులు దేశం వెలుపల అదృశ్యమయ్యారని, మరి కొంత మంది దేశం లోపల దాగి ఉన్నారని, వారు తిరిగి పోరాడగలరంటూ ఒక వీధి వ్యాపారి మొహమ్మద్ అజీమ్ జిన్హువాతో అన్నారు. తాలిబన్లు ఏదైనా పొరపాటు చేస్తే హింసాత్మక యుద్ధానికి దారితీస్తుందని కాబూల్ నివాసి నూర్ ఖాన్ అన్నారు. అస్థిర పరిస్థితుల కారణంగా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖాన్, శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, పౌరులు ఉద్యోగావకాశాలు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Previous articleOne Of The Best Free Courting Websites Of 2019
Next articleనేడు డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ ప్రారంభం