Home రాజకీయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధూ ఆతిథ్యం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధూ ఆతిథ్యం

388
0
Punjab PCC Chief Sidhu
Punjab PCC Chief Sidhu

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్దూ తమ పార్టీకి చెందిన 62 పార్టీ ఎమ్మెల్యేలకు అమృత్ సర్ లోని తన నివాసంలో బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. సిద్దూ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు బహిరంగమే. ఈ నేపథ్యంలో తన నివాసంలో ఒక రకంగా తనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్యను తెలియజేసేందుకే సిద్ధూ ఈ ఆతిథ్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సిద్ధూ ఇంటికి చేరుకున్న ప్రముఖ మంత్రులలో సుఖ్ జిందర్ రాంధవా, ట్రిప్ట్ రజిందర్ సింగ్ బజ్వా, చరణ్ జిత్ సింగ్ చన్నీ, సుఖ్ బిందర్ సింగ్ సర్కారియాతో పాటు పార్టీ సీనియర్ నాయకులూ సునీల్ జఖర్ ఉన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ కు 80 మంది ఎమ్మెల్యేలుండగా, 18 మంది మాత్రమే సిద్ధూ విందుకు హాజరు కాలేదు. తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి లగ్జరీ బస్సుల్లో ఎక్కి అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సిద్ధూ సందర్శించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు తరలి వచ్చారు. అనంతరం వారు దుర్గియానా ఆలయానికి, రామ్ తీరత్ స్తాల్‌కు కూడా వెళ్లారు.
క్షమాపణ అవసరం లేదు ‘
సిద్ధూను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా నియమించినప్పటికీ, పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం ఇంకా సమసి పోలేదు. తనపై అవమానకరంగా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన దానికి సిద్ధూ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని, దానిపై తగ్గేదే లేదని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. క్రికెటర్ మారిన రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పే వరకు అమరీందర్ సిద్దును కలవరని సిఎం మీడియా సలహాదారు మంగళవారం ట్వీట్ చేయడం వీరి మధ్య వివాదం సమసిపోలేదనే విషయం స్పష్టం చేసింది. అయితే సిద్దూ తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేల మద్దతును పొందారు. వారిలో కొందరు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

సమావేశాన్ని నిర్వహించడం వెనుక ఉన్న మంత్రి రాంధా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవర్తన పట్ల తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. రాష్ట్ర యూనిట్ చీఫ్‌గా సిద్దూ ఎదిగిన నేపథ్యంలో గతంలో ఏమైనా విభేదాలు ఉన్నప్పటికీ అందరూ గౌరవించి అంగీకరించాలని వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడు పార్తాప్ సింగ్ బజ్వా, సుఖ్పాల్ సింగ్ ఖైరా కూడా ఇంతకు ముందు అమరీందర్ సింగ్ తో గొడవ పడ్డారని, కానీ ఇప్పుడు వారు తమ విభేదాలను పక్కన పెట్టినట్లు రాంధవా చెప్పారు. శుక్రవారం చండీగఢ్ లో పీసీసీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాధ్యతలు స్వీకరిస్తారని, దీనికి ముఖ్యమంత్రి హాజరవుతారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ నాగ్రా తెలిపారు.

రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమితులైన తరువాత అమృత్‌సర్‌కు వచ్చినప్పుడు సిద్దూకు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు నగరంలోని చాలా చోట్ల సిద్దూ పోస్టర్లు పెట్టారు. అమరీందర్‌తో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీలో మద్దతును సమీకరించాలని భావించిన సిద్దూ.. చండీగఢ్ లోని తన నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2020 జనవరిలో పంజాబ్ పీసీసీ కమిటీ, జిల్లా కమిటీలను రద్దు చేసిన తరువాత పార్టీ యొక్క సంస్థాగత పనితీరు మందగించడంతో పాటు కార్యకర్తల్లో నిస్తేజం అలముకుంది. అయితే తాజాగా పీసీసీ అధ్యక్షునిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ని నియమించడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది.

Previous articleపెగాసస్ దుర్వినియోగంపై కమిటీ : ఇజ్రాయేల్
Next articleకరోనా పుట్టుక పై దర్యాప్తు.. నిరాకరించిన చైనా!