Home ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ లో పాశవికం.. విలేకరిని హత్య చేసిన పోలీసు?

కర్నూల్ లో పాశవికం.. విలేకరిని హత్య చేసిన పోలీసు?

478
0
Journalist Murdered by Police in Kurnool
Journalist Murdered by Police in Kurnool

కర్నూల్ లో పాశవికం.. విలేకరిని హత్య చేసిన పోలీసు? ఆయన ఓ పాత్రికేయుడు.. నిజాలను వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పడమే ఆయన పాలిట శాపంగా మారింది. మాట్లాడదామని ఇంటికి పిలిచి.. పాశవికంగా మట్టుబెట్టారు నిందితులు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసు కావడమే గమనార్హం. చట్టాన్ని కాపాడాల్సిన వాడే.. కక్షగట్టి గొంతులో పొడిచి చంపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


ఇటీవల కర్నూలులో గుట్కా వ్యాపారాలు పెచ్చు మీరుతున్నాయి. దీనికి ఖాకీలు సహకారం అందిస్తున్నారని, వారి అండదండలతోనే ఈ తతంగం సాగుతోందనే వార్తలు ప్రజల నోళ్ళలో నానుతున్నాయి.

ఈ క్రమంలో దీని వెనుక గుట్టును బయటకు తీయాలని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విలేకరి కేశవ తలంచాడు. ఈయన వి5 అనే యూట్యూబ్ ఛానల్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

తన విధి నిర్వహణలో భాగంగా సంచలన విషయాలను బయటకు తీసుకొచ్చాడు. స్థానిక టూటౌన్ కానిస్టేబుల్ సుబ్బయ్యకు గుట్కా వ్యాపారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆధారాలు సంపాదించాడు. పోలీసులు తనిఖీలకు వెళ్లే సమయంలో ఆ సమాచారాన్ని ముందుగా గుట్కా వ్యాపారులకు కానిస్టేబుల్ సుబ్బయ్య చేరవేస్తున్నాడని అనుమానించాడు.

ఈ క్రమంలో ఓ గుట్కా వ్యాపారికి కానిస్టేబుల్ సుబ్బయ్య పోలీసుల తనిఖీల సమాచారం ఇస్తున్న ఆడియో టేపు సంపాదించాడు. దీనిని సరాసరి యూట్యూబ్ ఛానల్ లో అప్‌లోడ్‌ చేశాడు. అంతే కాకుండా ఈ విషయంపై నేరుగా కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి చేరవేశాడు. విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు.

దీనికి కారణం విలేకరి కేశవ అని తెలుసుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య పగతో రగిలిపోయాడు. తన ఉద్యోగం పోవడానికి కారణమైన సుబ్బయ్యను మట్టుబెట్టడానికి పథకం రచించారు నిందితులు. ఈ క్రమంలోనే మాట్లాడే పని ఉంది రమ్మంటూ ఆదివారం సాయంత్రం స్థానిక ఆటోస్టాండ్ వద్దకు రప్పించారు.

అయితే కేశవ తనతో పాటు సహచర విలేకరి ప్రతాప్ ను వెంట పెట్టుకుని ఆటోస్టాండ్ వద్దకు వెళ్ళాడు. వారిని నింధితులు స్థానిక ఎన్‌జిఓ కాలనీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. ప్రతాప్ బయట వేచి చూస్తుండగా, సుబ్బయ్య, ఆయన సోదరుడు నాని కలిసి విలేకరి కేశవను ఇంటిలోకి తీసుకెళ్లారు. అక్కడ కేశవకు, సుబ్బయ్యకు మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలో కేశవ పెద్దగా కేకలు వేయడం విన్న ప్రతాప్.. వెంటనే ఇంటిలోకి పరుగు తీశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. గాయం కారణంగా ఆసుపత్రికి తీసుకు రావడానికి ముందే కేశవ మృతి చెందాడని వైద్యులు చెప్పాడు.

ఈ విషయాన్ని కేశవ కుటుంబ సభ్యులకు ప్రతాప్ చేరవేశారు. సంఘటన గురించి తెలుసుకున్న పాత్రికేయ సంఘాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలనీ, బాధితులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశాయి. అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

డీఎస్పీ చిదానంద రెడ్డి, సిఐ మురళీమోహన్ రావు ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. స్క్రూ డైవర్ తో బలంగా వీపుపై పొడిచి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పాత్రికేయులకు హామీనిచ్చారు.

For More News

Previous articleజావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం.. తీరిన భారత్ వందేళ్ల కల
Next articleJackfruit health benefits