Home అంతర్జాతీయ వార్తలు కరోనా పుట్టుక పై దర్యాప్తు.. నిరాకరించిన చైనా!

కరోనా పుట్టుక పై దర్యాప్తు.. నిరాకరించిన చైనా!

335
0
China Denied another investigation on Corona Leakage from Wuhan Lab
China Denied another investigation on Corona Leakage from Wuhan Lab

కరోనావైరస్ మూలాల గురించి మరో దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. ఈ వైరస్ ప్రయోగశాల నుంచి లీక్ అయిందో లేదో పరిశీలించడానికి డబ్ల్యూహెచ్‌ఓ దర్యాప్తును సూచించగా, అటువంటి సిద్ధాంతానికి ఆధారాలు లేవని చైనా కొట్టిపారేసింది. చైనాకు చెందిన ఉన్నత శాస్త్రవేత్తల బృందం గురువారం బీజింగ్లో సమావేశమైంది. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందనడానికి ఆధారాలు లేవని, అది చాలా అసాధ్యం అని వారు పేర్కొన్నారు. వివాదానికి కేంద్రంగా ఉన్న వుహాన్ ప్రయోగశాలలో ఎప్పుడూ ఇలాంటి వైరస్ లేదంటూ డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి పనిచేస్తున్న చైనా నిపుణుల బృందానికి నాయకత్వం వహించిన ఎపిడెమియాలజిస్ట్ లియాంగ్ వానియన్ చెప్పారు.
కరోనా వైరస్ ను మేడ్ ఇన్ చైనా గా అభివర్ణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రపంచ వ్యాప్తంగా పలువురు బలపరిచిన విషయం తెలిసిందే. కొంతమంది ప్రపంచ నాయకులు లోతైన దర్యాప్తు కోసం పిలుపునిచ్చారు. చైనా ప్రయోగశాలలో వైరస్ తయారు అయ్యిందనే వాదనను బీజింగ్ తిరస్కరించినప్పటికీ, దర్యాప్తును మాత్రం అడ్డుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. బ్యాట్-బర్న్ వ్యాధికారక, ఇతర కరోనావైరస్లను అధ్యయనం చేసిన వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాలను పరిశోధించడానికి డబ్ల్యూహెచ్‌ఓ ఎంత ప్రయత్నించినా చైనా అడుగడుగునా అడ్డుతగులుతూనే ఉంది.

వైరస్ మూలంపై అధ్యయనంలో తమ వాదనను కూడా వినాలని, తమ ప్రయోగశాల నుంచే వైరస్ లీక్ అయిందని వస్తున్న ఆరోపణలను తాము తిరస్కరిస్తున్నామని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఉపాధ్యక్షుడు జెంగ్ యిక్సిన్ అన్నారు. వైరస్ జంతువుల నుంచి ఉద్భవించిందని ఒక వర్గం, మానవులు లేదా ప్రయోగశాల నుంచి వచ్చిందని మరొక వర్గం వాదిస్తూ యు.ఎస్. ఇంటెలిజెన్స్ అధికారులు రెండుగా విడిపోయారనే వాదనలు వస్తున్నాయి. అయితే కరోనావైరస్ లను వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధ్యయనం చేస్తున్నట్లు, దాని ద్వారానే వైరస్ బయటకు వచ్చిందని వాదన చైనాపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ మూలాన్ని వెలికి తీయడానికి తాము కట్టుబడి ఉన్నామని చైనా అధికారులు తెలిపారు. అయితే మూలాల అధ్యయనం అనేది సైన్స్ ఆధారంగా ఉండాలని చెబుతున్నారు. తమపై వస్తున్న ఆరోపణలన్నీ చైనా వ్యతిరేక శక్తుల వ్యాఖ్యలుగా వారు అభివర్ణించారు. పరిశోధన ప్రయత్నాలను ఆలస్యం చేయడం, వ్యాధి మూలాలపై స్వతంత్ర పరిశోధకుల దర్యాప్తును అడ్డుకోవడం పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చైనాకు బాసటగా నిలిచిన డబ్ల్యూహెచ్‌ఓ, తదుపరి దర్యాప్తుకు సహకరించాలని చైనాకు విజ్ఞప్తి చేసింది.

Previous articleకాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధూ ఆతిథ్యం
Next articleకరోనా భయంతో ఏడాదిన్నరగా తలుపులేసుకుని.. ఏపీలో వెలుగు చూసిన ఘటన