Home రాజకీయం ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యే : రాహుల్ గాంధీ

ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యే : రాహుల్ గాంధీ

348
0
Women MPs thrashed, democracy murdered: Rahul Gandhi
Women MPs thrashed, democracy murdered: Rahul Gandhi

ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యే : రాహుల్ గాంధీ లోక్‌సభ, రాజ్యసభ వర్షాకాల సమావేశాలను అకస్మాత్తుగా ముగించడం, ఎగువ సభలో బుధవారం మహిళా ఎంపీలపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు గురువారం ఉదయం పార్లమెంట్ భవనం వెలుపల మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతా కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లోపల తమకు మాట్లాడేందుకు అనుమతి లేదని, తమ భావాలను మీడియాకు తెలిపేందుకే వచ్చామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యగానే తాము భావిస్తున్నామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయని, దేశంలోని 60 శాతం మంది తరుపున వినిపించే స్వరం రాజ్యసభలో భౌతికంగా నలిగిపోయిందని చెప్పారు. రాజ్యసభలో ముఖ్యంగా మహిళా ఎంపీలపై దాడి చేయడం తీవ్ర గర్హనీయమని వ్యాఖ్యానించారు.

శివసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహిళలతో సహా ఎంపీలపై భౌతిక దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలంతా పాకిస్తాన్ సరిహద్దులో నిలబడి ఉన్నట్లు అనిపిస్తోందని ప్రకటించారు. పార్లమెంటులో తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రతిపక్షానికి అవకాశం లభించలేదన్నారు. బుధవారం మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి సంఘటన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు.

రాజ్యసభలో బీమా బిల్లు సంబంధించిన సవరణను ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు భీకర దృశ్యాలు కనిపించాయి. పలువురు మహిళా కాంగ్రెస్ ఎంపీలు హౌస్ వెల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మగ మార్షల్స్ తమను శారీరకంగా వేధించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్‌లో మహిళా ఎంపీలపై దాడి చేయడాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.

రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేష్ మాట్లాడుతూ హాల్ లోపల పెద్ద భద్రతా దళాలు మోహరించిన తర్వాత ఈ సవరణ ఆమోదించబడిందని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీకి పంపడానికి ప్రభుత్వం నిరాకరించిందన్నారు. బిజెపి తన సన్నిహిత పక్షాల మాటలను కూడా పట్టించుకోలేదని, ఇక ప్రతిపక్షాల పట్ల వ్యవహరించిన తీరు దారుణాతి దారుణమని ఆయన ట్వీట్ చేశారు.

ఈ వర్షాకాల సమావేశాల్లో 15 కి పైగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఐక్య ఫ్రంట్ గా మారి, ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశాయి. పెగాసస్ కుంభకోణం, పెరుగుతున్న ఇంధన ధరలు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రస్తుత వర్షాకాల సమావేశాలు సజావుగా సాగలేదు. ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్య సభ రెండు సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షాల నాయకులను గురువారం సమావేశానికి పిలిచారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష నాయకులను సమావేశానికి ఆహ్వానించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ప్రదర్శించిన ఐక్యతను బలోపేతం చేయడానికి ఈ సమావేశం తలపెట్టారని తెలుస్తోంది.

Previous articleఒబిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
Next articleదేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు అవకాశం : భద్రత ఏజెన్సీల హెచ్చరిక