Home ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

191
0
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం తిరుపతి మరియు తిరుమలలో రెండు రోజుల పర్యటన పూర్తయిన తర్వాత విజయవాడకు వెళ్లే ముందు మీడియాతో మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లాది రూపాయలు కేటాయించే వివిధ పథకాలను వివరించారు.

పేదలకు గృహనిర్మాణం కోసం రాష్ట్రం రూ .28000 కోట్లను పొందిందని కిషన్ రెడ్డి వివరించారు. అయితే ఇతర పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటాను అందించలేకపోయిందని, అందువల్ల అవి అమలుకు నోచుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చవద్దని, వాటిని యథాతథంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.

తెలుగు రాష్ట్రాల నుంచి క్యాబినెట్ మంత్రిగా, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మరియు ఇతర విభజన కట్టుబాట్ల పరిష్కారంలో చొరవ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నది ఎన్‌డిఎ ప్రభుత్వ విధానమన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి వైపు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారితో తీవ్ర ప్రభావితమైంది పర్యాటక రంగమని చెప్పారు. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వివిధ దేశాలు చర్చించాయని ఆయన అన్నారు. దీనికి భారత్ మినహాయింపు కాదనీ, పర్యాటక అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి పలువురిని సంప్రదిస్తున్నామని వివరించారు. కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గితే ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాలికను 2022 జనవరి 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఈ ప్రణాళికను వారంలో ప్రకటిస్తామని, ‘దేఖో అప్నా దేశ్’ నినాదంతో ముందుకు సాగుతుందని తెలిపారు.

కిషన్ రెడ్డి పార్లమెంటును స్తంభింపజేసిన విపక్ష పార్టీలను విమర్శించారు. ప్రధాన మంత్రి తన మంత్రి మండలిని ప్రవేశపెట్టడానికి విపక్షాలు సహకరించలేదన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మొదటిసారి చోటు దక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒబిసి వంటి ముఖ్యమైన బిల్లులపై చర్చకు వారు అనుమతించలేదని వాపోయారు.

దీంతో ఆశీర్వాదాలు పొందడానికి ప్రజల వద్దకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులను కోరారన్నారు. దానిలో భాగంగా తిరుపతి నుండి తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. విజయవాడ, తెలంగాణకు వెళ్లడానికి ముందు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందానన్నారు. కేంద్రంలో మోడీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి బిసిలకు చట్టబద్ధమైన కమిషన్ లేదని, ఒబిసిలకు విద్యాసంస్థలలో రిజర్వేషన్లను కూడా ప్రధాని సరిదిద్దారని ఆయన అన్నారు.

మోడీ చొరవ కారణంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి టీకాలు వేశామని ప్రకటించారు.థర్డ్ వేవ్ వస్తుందో లేదో చెప్పలేమని, ప్రజల సహకారంతో కోవిడ్ ను దేశం నుంచి తరిమి కొట్టొచ్చని చెప్పారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకాలు వేయాలనే లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన వెంట ఎంపి సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, జి భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కె అజయ్ కుమార్, వరప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Previous articleటీకా రెండో డోసు పొందినప్పటికీ.. కరోనా విశ్వరూపం
Next articleగంగుబాయి కథివాడి కి లైన్ క్లియర్.. సంతోషంలో ఆలియా భట్