Home Covid 19 అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ దరఖాస్తు

  అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ దరఖాస్తు

  479
  0
  Johnson & Johnson applies for emergency use
  Johnson & Johnson applies for emergency use

  అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ దరఖాస్తు: జాన్సన్ & జాన్సన్ తన సింగిల్-డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈ యూఎస్ ఆధారిత ఔషధ కంపెనీ తెలిపింది. “ఆగష్టు 5న జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ తన సింగిల్-డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క అత్యవసర వినియోగ ప్రామాణీకరణ (EUA) కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది” అని అధికారిక ప్రటనను విడుదల చేసింది. జాన్సన్ & జాన్సన్ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో దాని సింగిల్ షాట్ వ్యాక్సిన్ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమని తేలింది. ఈ టీకా వల్ల ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండదని, మరణం నుంచి బయటపడొచ్చని నివేదిక చెబుతోంది.
  తమ సింగిల్-షాట్ వ్యాక్సిన్ అధ్యయనం చేసిన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కోవిడ్ తీవ్రమైన స్థితిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమైనదని, టీకా వేసిన 28 రోజుల తర్వాత ఇది ప్రభావం చూపుతుందని అని జాన్సన్ & జాన్సన్ కంపెనీ పేర్కొంది. బయోలాజికల్ ఇ. లిమిటెడ్ సహకారం ద్వారా భారతదేశంలోని ప్రజలకు, ప్రపంచంలోని మా సింగిల్-డోస్ కోవిడ్ -19 టీకాను తీసుకురావడానికి మార్గం సుగమం చేసే ఒక ముఖ్యమైన మైలురాయిగా కంపెనీ తెలిపింది. తమ సింగిల్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, గవి-కోవాక్స్ ఫెసిలిటీ వంటి సంస్థల సహకారంతో సరఫరా చేయనున్నామని జాన్సన్ & జాన్సన్ తన ప్రకటనలో తెలియజేసింది. మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి తమ కోవిడ్ -19 వ్యాక్సిన్ లభ్యతను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వంతో చర్చలను సఫలమవుతాయని ఎదురు చూస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
  డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) వర్గాల ప్రకారం, ఆగస్టులో, జాన్సన్ & జాన్సన్ భారతదేశంలో సింగిల్ షాట్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఎటువంటి కారణం చూపకుండా ఆమోదించాలని కోరింది. అనంతరం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ ఆమోదం కోసం తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్న కొన్ని గంటల తర్వాత, జాన్సన్ & జాన్సన్ ఈ విషయంలో ఒక ప్రకటనను విడుదల చేశారు. భారతదేశ ప్రజలకు సింగిల్-డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని సంస్థ వెల్లడించింది. జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ డోసులు జూలైలో భారతదేశానికి రావచ్చు అని కూడా నివేదికలు వెల్లడించాయి. US FDA ఫిబ్రవరి 2021 లో అత్యవసర ఉపయోగం కోసం జాన్సన్ & జాన్సన్ యొక్క వైరల్ వెక్టర్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అధికారం ఇచ్చింది. అయితే, అనుమతి పొందిన కొన్ని వారాల తర్వాత, టీకాతో అరుదైన రక్తం గడ్డకట్టే రుగ్మత ఎదురవుతోందని తేలింది.

  తమకు హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ – ఇ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ టీకాల సరఫరాలో బయోలాజికల్ – ఇ సంస్థ కీలకపాత్ర అని చెప్పింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను బయోలాజికల్ – ఇ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల శుక్రవారం కలుసుకున్నారు. సింగిల్ డోస్ టీకాను తగిన సహకారం అందిస్తామని మంత్రి ఆ సంస్థకు భరోసా ఇచ్చారు.
  జాన్సన్ & జాన్సన్ దాని సింగిల్-షాట్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న వేరియంట్ లకు వ్యతిరేకంగా పని చేస్తుందని పేర్కొంది. దీంతో దీనికి అనుమతులు ఇచ్చే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు, భారతదేశంలో నాలుగు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఆస్ట్రాజెనెకా-కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి, మోడర్నా టీకాలు అనుమతి పొందిన జాబితాలో ఉన్నాయి.

  For latest News

  Previous articleపులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు
  Next articleరైతుల నిరసనలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు